HealthHome Page SliderInternationalNews Alert

‘టేస్ట్‌అట్లాస్’లో మసాలా దోశకు స్థానం

ప్రపంచ ఆహార పటంలో భారతీయ రుచులు మరోసారి సత్తా చాటాయి. గ్లోబల్ ఫుడ్ గైడ్ ‘టేస్ట్‌అట్లాస్’ ప్రకటించిన 2026 ప్రపంచ అత్యుత్తమ ప్యాన్‌కేక్స్ జాబితాలో మన దక్షిణ భారతీయ వంటకం ‘దోశ’ ఆరో స్థానంలో నిలిచింది. విదేశీయుల తీపి ప్యాన్‌కేక్స్‌ను కాదని, మన కరకరలాడే కారం మసాలా దోశలు గ్లోబల్ టేస్ట్ బడ్స్‌ను మాయ చేయడం విశేషం.దోశలోని ఘుమఘుమలాడే ఆలుగడ్డ మిశ్రమం, దానికి తోడయ్యే అల్లం చట్నీ, వేడివేడి సాంబార్‌ రుచికి అంతర్జాతీయ ఆహార ప్రియులు ఫిదా అయిపోయారు. మన ఊరి రుచి ఇప్పుడు ప్రపంచ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్‌గా మారిపోయింది. కేవలం మసాలా దోశ మాత్రమే కాదు.. మన సాధారణ దోశ సైతం 15వ ర్యాంక్‌తో తన ఉనికిని చాటుకుంది. ఇక పేపర్ లాగా పలుచగా ఉండి పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టపడే పేపర్ దోశ 35వ స్థానాన్ని దక్కించుకుంది. ఇలా ఒకే వంటకానికి చెందిన మూడు వెరైటీలు టాప్-50లో నిలవడం భారతీయ ఆహార సంస్కృతికి దక్కిన అరుదైన గౌరవం. సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో ప్యాన్‌కేక్స్ అంటే మైదా, గుడ్లు, పంచదార సిరప్‌లతో చేస్తారు. కానీ బియ్యం, మినప్పప్పును నానబెట్టి, సహజమైన పద్ధతిలో పులియబెట్టి చేసే మన దోశల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఈ ఆరోగ్యకరమైన వైవిధ్యమే మన దోశలను గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టింది.