NationalNews Alert

పోలీసుల అదుపులో మావోయిస్ట్ కమాండర్ రజిత

మావోయిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు దామోదర్ భార్య కొత్తగూడెం జిల్లా చర్ల లోకల్ గెరిల్లా స్కాడ్ దళ కమాండర్‌ రజిత అలియాస్‌ మడకం కోసిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు మరో ఐదుగురు దళ సభ్యులను ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ అడవుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దుమ్ముగూడెం మండలం ములకనాపల్లికి చెందిన రజిత మావోయిస్టు పార్టీ చర్ల దళ కమాండర్‌గా పని చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌ భార్య అయిన రజితను నిన్న ఉదయం అదుపులోకి తీసుకున్నట్టు దళ సభ్యుడి పేరుతో లేఖ విడుదలైంది. వీరిని ఎన్‌కౌంటర్ చేసే ప్రమాదం ఉందని వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా కోర్టులో హజరుపర్చాలని మావోయిస్టు పార్టీ భద్రాది కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ కోరారు. ఈ మేరకు అజాద్ నిన్న మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు.

తెలంగాణ- ఛత్తీస్‌గడ్ పోలీసులు నిన్న తెల్లవారుజామున మూకుమ్మడిగా కుర్నపల్లి, డోకుపాడు, కొండెవాయి గ్రామాలపై దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు . అనారోగ్యంతో ఉన్న రజితతో పాటు ఐదుగురు దళ సభ్యులను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. వీరిని బూటకపు ఎన్‌కౌంటర్ చేసే ప్రమాదం ఉందని వారికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టిన ప్రభుత్వం, పోలీసులు, అధికార పార్టీ నాయకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అరెస్టు విషయాన్ని తెలుసుకున్న రజిత తల్లిదండ్రులు మారయ్య, పోజ్జమ్మ వారి స్వగ్రామమైన దుమ్ముగూడెం నుంచి భద్రాచలం వచ్చారు. తమ కుమారైను కోర్టులో హజరుపరచాలని ఎలాంటి హాని చేయకూడదని మీడియా ద్వారా పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
పోలీసులు వెతుకుతున్న కొద్దిమంది నక్సల్స్‌లో రజిత ఒకరు. ఇటీవల వారి చిత్రాలతో కూడిన వాల్ పోస్టర్‌ను విడుదల చేసి, ఇన్‌ఫార్మర్‌లకు నగదు రివార్డు ఇస్తామని ఆమె కదలికలను పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ఆమె తలపై రూ.10 లక్షల నగదు బహుమతిగా ఉన్నట్లు సమాచారం.