కేసీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్న కిషన్ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా మరోసారి కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై తీవ్రవిమర్శలు చేశారు. భారీ పరిశోధన తర్వాత సీఎం కేసీఆర్ మూడు గంటలపాటు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి చెప్పిందే పదే పదే చెప్పారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగ పదవిలో వుండి తన హోదాను మరిచారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు వర్షాల కారణంగా పడుతున్న ఇబ్బందులను మరిచి దేశప్రధానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ చాలా చౌకబారు భాషతో అవహేళనగా మాట్లాడటం ఆయన అసహనాన్ని ,అభద్రతాభావాన్ని ,లోపల గూడుకట్టుకున్న భయాన్ని తెలియజేస్తుందన్నారు.
తెలంగాణ ప్రజలు వర్షాల కారణంగా పడుతున్న ఇబ్బందులను గుర్తించకుండా వాటిని ఎలా అధిగమించాలని ఆలోచించకుండా సీఎం కేసీఆర్ అసందర్భంగా మాట్లాడుతున్నారన్నారు కిషన్ రెడ్డి. ప్రపంచంలోని అనేక విషయాలను ప్రస్తావిస్తూ అన్ని విషయాలు తనకే తెలిసినట్లుగా మాట్లాడారన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ,మోదీని తీవ్ర పదజాలంతో విమర్శించడం కేసీఆర్ఆ డొల్లతనానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర,దేశ ప్రజలు అమాయకులు కాదని, అబద్దాలు పదే పదే చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మతించరన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందన్నారు. అన్నింటికంటే ముందుగా తెలంగాణా ప్రజలు వరదలతో పడుతున్న ఇబ్బందులను గుర్తించి సీఎం గా తన బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. ఆ తర్వాత ప్రపంచ,దేశ వ్యవహారాలను చర్చిస్తే బాగుంటుందన్నారు.
అంతకు ముందు సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీపైనా, ప్రధాని మోదీపైనా తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మోదీ సర్కారును గద్దె దించుతామన్నారు సీఎం కేసీఆర్. దేశంలోని అత్యంత అసమర్థ ప్రధాని మోదీ అని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని.. రూపాయి విలువ క్షీణిస్తోందని దుయ్యబట్టారు. మాతో గోక్కుంటే అగ్గితో గోక్కున్నట్టేనేనన్నారు. ఎవరికీ భయపడబోమన్న కేసీఆర్… అవసరమైతే అధికారాన్ని విసిరిపారేస్తానన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడారంటూ ఆక్షేపించారు.