జాతీయ పార్టీకి కేసీఆర్ ఖతర్నాక్ స్కెచ్
మునుగోడు నుంచే జాతీయ పార్టీని ఆరంభించేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. మునుగోడులో జాతీయ పార్టీగానే బరిలోకి దిగుతామన్నారు. విజయదశిమి రోజున కేసీఆర్ పార్టీ ప్రకటన చేస్తానన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట 19 నిమిషాలకు జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటిస్తానని కేసీఆర్ వెల్లడించారు. 5న జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో 283 మంది సభ్యులు జాతీయ పార్టీ ఏర్పాటును ఏకగ్రీవంగా ఆమోదిస్తారన్నారు. ఆ తర్వాత పార్టీ పేరును ప్రకటిస్తామని చెప్పారు. పార్టీ గుర్తు కారు కొనసాగుతుందని.. పేరు మాత్రం మారుతోందన్న క్లారిటీ ఇచ్చారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తానని కేసీఆర కుండబద్ధలుకొట్టారు. బీజేపీ తమ ప్రధమ శత్రువన్నారు. డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తానన్నారు.

ఆదివారం ప్రగతి భవన్‌లో కేసీఆర్ 33 జిల్లాల అధ్యక్షులతో 3 గంటలకు పైగా సమావేశమయ్యారు. దేశం టీఆర్ఎస్ వైపు చూస్తోందన్నారు కేసీఆర్. కేంద్ర ఎన్నికల సంఘం, న్యాయనిపుణులతో మాట్లాడి జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కొత్తగా పార్టీ ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులెదరవుతాయని… పేరు మార్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని కేసీఆర్ భావిస్తున్నారు. గతంలో జనసంఘ్, అన్నాడీఎంకే, టీఎంసీలు జాతీయ గుర్తుంపు పొందాయన్నారు. ఇక తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా కేటీఆర్ ఉంటారని తెలుస్తోంది. టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చేందుకు ఈనెల 6న ఈసీకి దరఖాస్తు చేయనున్నారు. జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్, తెలంగాణకు కేటీఆర్ అధ్యక్షులుగా ఉండవచ్చు.

