ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత… వంద కోట్ల ముడుపుల చుట్టూ విచారణ
ఢిల్లీలో రద్దైన మద్యం పాలసీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం చార్జ్ షీట్ దాఖలు చేసింది. దర్యాప్తులో కోర్టుకు ఈడీ కీలక ఆధారాలు సమర్పించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కె.కవిత పేరు రిపోర్టులో చేర్చడంతో సంచలనంగా మారింది. కేసులో అరెస్టయిన గురుగావ్ వ్యాపారవేత్త అమిత్ అరోరా విచారణ ఆధారంగా ఈ రిపోర్ట్ తయారు చేశారు. ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు అరెస్టయిన… వ్యాపారవేత్త విజయ్ నాయర్ ద్వారా కనీసం ₹ 100 కోట్ల కిక్‌బ్యాక్‌లు చెల్లించిన “సౌత్ గ్రూప్”లో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత కీలక సభ్యురాలు అని పేర్కొంది. ఇప్పటివరకు జరిపిన విచారణ ప్రకారం, విజయ్ నాయర్, AAP నాయకుల తరపున ఒక గ్రూప్ నుండి కనీసం ₹ 100 కోట్ల కిక్‌బ్యాక్‌లు అందుకున్నారంది. సౌత్ గ్రూప్ శరత్ రెడ్డి, K కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ద్వారా నియంత్రించ బడుతుందని తెలిపింది. ఇదే విషయాన్ని అరెస్టయిన అమిత్ అరోరా తన వాంగ్మూలాలలో వెల్లడించాడని ED తెలిపింది. ఈ ఆరోపణలపై కవిత గానీ తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటి వరకు స్పందించలేదు.

మద్యం కంపెనీ బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అమిత్ అరోరాను మంగళవారం రాత్రి అరెస్టు చేసిన తర్వాత స్థానిక కోర్టులో ప్రవేశపెట్టింది. రిమాండ్ కోరుతూ ఏజెన్సీ ఈ వాదనలు విన్పించింది. డిసెంబర్ 7 వరకు ఈడీ కస్టడీకి అనుమతించింది. ప్రభుత్వంలో భాగమైన కొందరు ఆప్ నేతలు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని ప్రభుత్వ సొమ్ముతో అక్రమ ఆస్తులను సంపాదించుకునేందుకు ఒక మాధ్యమంగా వాడుకున్నారని ఈడీ విచారణలో పేర్కొంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ సహా కనీసం 36 మంది నిందితులు 170 ఫోన్‌లను ధ్వంసం చేసి, వేల కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన సాక్ష్యాలను దాచిపెట్టారంది. ఐతే ఈడీ రిపోర్ట్‌పై ఢిల్లీ ఆప్ సర్కారు విరుచుకుపడింది. ఈ ఆరోపణలు రాజకీయ కక్ష సాధింపులో భాగమంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా ఆరోపణలను కొట్టిపారేశారు. ఈడీ, సీబీఐతో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యర్థులను నియంత్రించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. భారత్ రాష్ట్ర సమితి ద్వారా… జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్న తరుణంలో అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ఇప్పటికే కొనసాగుతోంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కవిత పేరు ఉండటం… రెండు పార్టీల మధ్య మరింత రాజకీయ విమర్శ, ప్రతి విమర్శకు కారణం కానుంది.

