విశాఖ రాజధానిగా జగన్ స్పీచ్
◆ అభివృద్ధి అన్ని వైపులకు విస్తరించాలన్నదే లక్ష్యం
◆ ఏ ప్రాంతం పైన ప్రత్యేకంగా కోపం లేదు
◆ కట్టని రాజధాని గురించి కట్టలేని గ్రాఫిక్స్ గురించి ఉద్యమాలా?
◆ పాలన వికేంద్రీకరణతోనే సత్ఫలితాలు
◆ వికేంద్రీకరణకే జగన్ మొగ్గు
◆ తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో రాజధానిపై సుదీర్ఘ చర్చ
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతోనే పరిపాలన వికేంద్రీకరణ జరగాలంటున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. పాలనా వికేంద్రీకరణతోనే ఆయా ప్రాంతాల అభివృద్ధి చేసి మెరుగైన సత్ఫలితాలు సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కట్టని రాజధాని గురించి కట్టలేని గ్రాఫిక్స్ గురించి ఉద్యమాలు చేయటం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో కొత్త దిశలో రాష్ట్రం పయనించబోతుందనే సంకేతాలు స్పష్టమయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం యొక్క ఆలోచన స్పష్టమైపోయింది. వివాదాస్పద రాజధాని అంశంపై ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణ అర్ధమైంది. పాలనా వికేంద్రీకరణ విధానాన్ని తప్పక అమలు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం తొలిరోజు అసెంబ్లీలో ప్రతిధ్వనించింది.

రాజధాని అంశంపై సుదీర్ఘంగా సాగిన తొలి రోజు సమావేశం అసెంబ్లీ చాలా లోతుగా చర్చించింది. అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని ఆ ప్రాంత రైతులు ఒకవైపు మహాపాదయాత్ర జరుపుతున్న సమయంలోనే అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల గురించి తమ రోడ్డు మ్యాప్ ను వివరించింది. వాస్తవానికి తమ ప్రభుత్వ ఉద్దేశం మూడు రాజధానులేనని గత కొద్ది నెలలుగా మంత్రుల ద్వారా తమ పార్టీ పెద్దల ద్వారా ప్రజల్లోకి సంకేతాలు పంపిన జగన్.. అసెంబ్లీ సాక్షిగా మరొకసారి తమ పార్టీ విధానం మూడు రాజధానులేనని వెల్లడించారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలంటే లక్షల కోట్లు అవసరమవుతాయని దానికి పెట్టే ఖర్చులో 10 శాతం పెడితే విశాఖ నగరంతో పాటు పలు ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవచ్చని జగన్ భావిస్తున్నారు. మొత్తం మీద ఈ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన మనసులో మాట చెప్పటమే కాకుండా వికేంద్రీకరణ విషయంలో తమ చిత్త శుద్ధి గురించి వెల్లడించింది.

గత కొద్ది రోజులుగా విశాఖపట్నంలోనే ప్రభుత్వం పాలన వ్యవహారాలను లాంఛనంగా ప్రారంభించబోతున్నారని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా జగన్ చేసిన వ్యాఖ్యలు వాటికి బలాన్ని చేకూర్చాయి. వికేంద్రీకరణ రాష్ట్రానికి ఎంత అవసరమో మరోసారి విడమర్చి చెప్పటానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా సద్వినియోగం చేసుకుంది. పాలన రాజధానిగా విశాఖపట్నం ని ఎంచుకోవడం ద్వారా వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో సమానంగా తీసుకురావాలనేది తమ ఆకాంక్షని ప్రభుత్వం మరో మారు స్పష్టం చేసింది. న్యాయ రాజధానిగా కర్నూలు ఎంపిక చేయడం ద్వారా రాయలసీమకు సమాన భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. మొత్తం మీద రాజధాని అంశంపై తాజాగా మరోసారి ప్రభుత్వ విధానం స్పష్టం చేయటంతో రాజకీయ వేడెక్కింది. ఒక రాజధాని ఉండాలా మూడు రాజధానులు అవసరమా అనే చర్చల నేపథ్యంలో ఏదో ఒక విధంగా ఈ అంశంపై ముగింపు పలికి రాజధాని ఏదో అని స్పష్టం చేసేలా ప్రభుత్వం కృషి చేయాలని ఏపీ ప్రజల కోరుకుంటున్నారు.

