Home Page SliderInternational

నోబెల్ శాంతి బహుమతి పొందిన ఇరాన్ ఖైదీ

Share with

ఇరాన్‌కు చెందిన మానవహక్కుల ఉద్యమదారు నర్గీస్ మొహమ్మదికి నోబెల్ శాంతి బహుమతి లభించింది.  కానీ దురదృష్టవశాత్తూ ఆమె జైలులో ఉన్నారు. మహిళలు, బాలికల పట్ల వివక్షతకు వ్యతిరేకంగా సంవత్సరాలుగా  ఆమె జరిపిన పోరాటానికి ఈ బహుమతి అందజేస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. 51 సంవత్సరాల వయస్సున్న ఈ మహిళా జర్నలిస్టు తన జీవిత కాలంలో దాదాపు 20 సంవత్సరాలకు పైగా జైలు జీవితంలోనే గడిపారు. ఆమె జైలు బయట ఉన్న కాలంలో  మహిళలకు తప్పని సరి హిజాబ్‌కు, మరణ శిక్షలు అమలు చేయడానికి వ్యతిరేకంగా పోరాడారు. 2003లో నోబెల్ ప్రైజ్ పొందిన ఇరానీ మానవహక్కుల లాయర్ షిరిన్ ఎబడీ నెలకొల్పిన ఢిఫెండర్స్ ఆఫ్ హ్యుమన్ రైట్స్ సెంటర్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆమె ఇప్పటి వరకూ 13 సార్లు అరెస్టు అయ్యారు. పోరాట యోధులైన తమను ఎంతగా బంధిస్తే తాము అంత శక్తివంతులుగా మారతామని ఆమె ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.

ఈ మధ్యకాలంలో చనిపోయిన 22 సంవత్సరాల మహిళకు న్యాయం జరగాలంటూ జరిగిన దేశవ్యాప్త ఆందోళనలలో ఆమెను అరెస్టు చేశారు. ఆమె జైలులో ఉండడంతో ఈ నోబెల్ ప్రైజ్‌ను పొందడానికి వెళ్లలేకపోవచ్చు. నోబెల్ బహుమతి ప్రధానం డిసెంబర్ 10 న  ఓస్లోలో జరగనుంది.  గతంలో కూడా అనేక మంది ఖైదీలు నోబెల్ శాంతి బహుమతి విజేతలుగా ఉన్నారు. గత సంవత్సరం బెలారస్‌కు చెందిన అలెస్ బియాలిట్స్‌కి వచ్చిన బహుమతిని కూడా ఆయన జైలులో ఉండడంతో ఆయన భార్య అందుకున్నారు. నోబెల్ బహుమతి ప్రధానోత్సవంలో ఆమెను పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని నార్వేజియన్ నోబెల్ కమిటీ పేర్కొంది. ఇరాన్ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని ఆమెను విడుదల చేయాలని కోరుకుంటున్నట్లు నోబెల్ కమిటీ హెడ్ బెరిట్ రీస్- అండర్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు.