పోకిరీల వేధింపులకు ఐపీఎస్ అధికారిణి షాక్
. -సీపీ సుమతి సాహసోపేత ఆపరేషన్
నగరంలో మహిళల భద్రతను పర్యవేక్షించేందుకు మల్కాజ్‌గిరి సీపీ సుమతి చేసిన సరికొత్త ప్రయోగం సంచలనంగా మారింది. అర్ధరాత్రి వేళ ఒంటరి మహిళగా రోడ్డుపై నిల్చుంటే పోకిరీల ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. సామాన్య మహిళలా వేషధారణ మార్చుకుని మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకు దిల్‌సుఖ్‌నగర్ పరిసరాల్లో నిల్చున్నారు. ఈ క్రమంలో అక్కడ తిరుగుతున్న ఆకతాయిలు ఆమెను సామాన్య మహిళగా భావించి చుట్టుముట్టారు.
ఐపీఎస్ అధికారిణి అని తెలియని పోకిరీలు ఆమెను అసభ్య పదజాలంతో వేధిస్తూ, “వస్తావా? రేటెంత?” అంటూ దారుణంగా ప్రవర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సుమతిపై వేధింపులకు దిగిన దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఎక్కువమంది విద్యార్థులు, ఉద్యోగార్థులు ఉండటం గమనార్హం. వీరిలో కొందరు గంజాయి మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వారందరికీ సీపీ సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఒక ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారిణికే అర్ధరాత్రి రోడ్డుపై ఇలాంటి చేదు అనుభవం ఎదురైందంటే, ఇక సామాన్య మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందోనని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళల రక్షణ కోసం ప్రాణాలకు తెగించి ఇలాంటి ఆపరేషన్ నిర్వహించిన సీపీ సుమతిపై ప్రశంసలు కురుస్తున్నాయి. నగరంలో మహిళల భద్రతకు ముప్పు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి స్పెషల్ ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

