టీడీపీకి జైకొట్టిన ఇండియా టుడే, వైసీపీకి జైకొట్టిన టైమ్స్ ఆఫ్ ఇండియా
రెండు జాతీయ న్యూస్ చానెళ్లు 24 గంటల వ్యవధిలో ఇచ్చిన సర్వే అంచనాలు ఏపీలో ఆసక్తి కలిగించాయ్. మొదట్నుంచి వైసీపీకి అనుకూలంగా వస్తున్న టైమ్స్ సర్వే ఈసారి కూడా వైసీపీ మెజార్టీ సీట్లను గెలుచుకుంటుందని చెప్పగా, ఇండియా టుడే సర్వే టీడీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తోందని పేర్కొంది. టైమ్స్ నౌ సర్వే వైసీపీ అనుకూలంగా చేయించుకుందన్న విమర్శలున్నాయ్. ఇక ఇండియా టుడేపై ఎలాంటి చర్చ జరుగుతుందో చూడాలి. ఇటీవల తిరుపతిలో ఇండియా టుడే ఆధ్వర్యంలో విద్యా సదస్సు సైతం ఎంతో రచ్చకు కారణమైంది. అయితే ఏపీ సర్కారు విద్యా సదస్సు నిర్వహించిన కొద్ది రోజుల్లోనే ఏపీ సర్వే ఫలితాలను ఇండియా టుడే విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు గాను చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 17 స్థానాలను గెలుచుకోవచ్చని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 17 స్థానాలను గెలుచుకోవచ్చని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది. మరోవైపు, అధికార వైఎస్‌ఆర్‌సీపీ ఈ ఏడాది 8 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇక మరో ఏజెన్సీ టైమ్స్ నౌ-మ్యాట్రిజ్ సర్వేలో ఇండియా టుడే సర్వేకు భిన్నమైన ఫలితాలొచ్చాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని తేలింది. 25 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ 19, తెలుగుదేశం-జనసేన కూటమి ఆరు స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది.

ఇక ఓటింగ్ పర్సంటేజ్ పరంగా… ఇండియా టుడే లెక్క ప్రకారం టీడీపీకి 45% ఓట్లు, వైసీపీకి 41 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. ఇక టైమ్స్ నౌ ఇచ్చిన సర్వే ప్రకారం ఓట్ల శాతం వైసీపీకి 47 శాతానికి పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉందని, టీడీపీ-జనసేన కూటమికి 44 శాతానికి పైగా ఓట్లు రావచ్చని పేర్కొంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో వైసీపీ స్వీప్ చేసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గాను ఆ పార్టీ 22 చోట్ల విజయం సాధిస్తే, టీడీపీ మూడు స్థానాలతో సరిపెటటుకొంది. ఇక కాంగ్రెస్, బీజేపీ ఏపీలో ఒక్క స్థానంలోనూ ప్రభావం చూపించలేకపోయాయి. అయితే నాటి పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోతున్నట్టుగా తాజా సర్వేలను బట్టి తెలుస్తోంది. మొన్నటి వరకు టైమ్స్ సర్వేల్లో వైసీపీ స్వీప్ వస్తోందన్న అంచనాలు రాగా.. తాజాగా ఆ సర్వే సంస్థ అంచనా ప్రకారం వైసీపీకి సీట్లు తగ్గుతాయని తేలింది. త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో సర్వే వార్.. ఏపీ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేస్తోంది.

