Andhra PradeshHome Page Slider

తెలుగుదేశం పార్టీలో టికెట్ల కోసం పెరుగుతున్న పోటీ

• అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు దృష్టి
• పార్టీకి సానుకూల పవనాలు వీస్తోండటంతో పెరుగుతున్న ఆశావహులు
• చంద్రబాబు దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతున్న అభ్యర్థులు
• ఎన్నికలకు ఏడాది ముందే టికెట్ల కోసం కుస్తీలు
• ఇప్పటికే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బెర్త్ లు కన్ఫామ్ చేసిన చంద్రబాబు

ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది. రోజుకు ఒక కొత్త వ్యూహంతో ప్రజల్లోకి బలంగా వెళ్తున్న ఆ పార్టీ పునర్ వైభవం కోసం అహర్నిశలు శ్రమిస్తుంది. ప్రజల నుంచి కూడా పార్టీకి సానుకూల స్పందన వస్తున్న తరుణంలో ఆ పార్టీలో టికెట్లు ఆశించే వారి సంఖ్య నానాటికి గణనీయంగా పెరుగుతోంది. ఇంకా ఏడాదికి పైగా సమయం ఉండగానే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎన్నికల సమరానికి సయ్యంటూ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సీట్ల కోసం నేతలు కుస్తీ పడుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేయటంతో మిగిలిన నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు జిల్లాల పర్యటనతో నిత్యం ప్రజల్లోనే ఉంటున్న చంద్రబాబు మరొకవైపు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు యువనేత నారా లోకేష్ యువగళం పేరిట రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీని తిరిగే అధికారంలోకి తెచ్చేందుకు ఒకవైపు అధినేత చంద్రబాబు మరోవైపు లోకేశ్ లు శ్రమిస్తూ ముందుకు సాగుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నట్లుగా భావిస్తున్న నేతలు టికెట్ల కోసం చంద్రబాబు ముందుకి క్యూ కడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కొన్ని ముఖ్య నేతలు నియోజకవర్గంలో తప్ప మిగిలిన నియోజకవర్గం టికెట్ల కోసం తమ వంతు ప్రయత్నాలు ఆయా అభ్యర్థులు చేస్తున్నారు. చంద్రబాబు దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతున్నారు. అలానే కొన్ని నియోజకవర్గాలో ఇదే సమయంలో ఇప్పటివరకు మౌనంగా పార్టీకి దూరంగా ఉంటున్న కొందరు నేతలు మళ్లీ తమ తమ నియోజకవర్గాల్లో యాక్టివ్ అవుతున్నారు. ఈ తరహా నేతలపై ఆ పార్టీ క్యాడర్లో కొంతమేర అసంతృప్తి నెలకొంది. అధిష్టానం కూడా వీరి పట్ల సానుకూలంగా లేదు. దీన్ని అవకాశం గా మలుచుకున్న కొందరు ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పటికే చంద్రబాబు దృష్టిలో పడేందుకు జోరుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నియోజకవర్గం పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతూ చంద్రబాబు నుంచి మంచి మార్కులు కొట్టేస్తున్నారు. చంద్రబాబు కూడా వీరికి కొంత అనుకూలమైన సంకేతాలు ఇస్తున్న పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో యువ నేతలు కొన్ని నియోజకవర్గాల్లో బలమైన ప్రభావాన్ని చూపుతున్నారు.

కేసులకు దాడులకు బెదరకుండా అధికార పక్షానికి దిటైన జవాబు ఇస్తున్నారు. ఇటువంటి యువ నేతలకు కూడా పార్టీ అధిష్టానం ప్రోత్సాహాన్ని ఇస్తుంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కొత్తగా సీట్లు ఆశించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుండటంతో చంద్రబాబు కొంత ఒత్తిడికి లోనవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకొక వైపు ఈసారి ఎన్నికల బరిలోకి ఎన్నారైలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత ఈసారి ఎన్నికల్లో ఆర్థిక అంగ బలం ఉన్న అభ్యర్థులను బరిలోకి దింపాలని యోచిస్తున్న తరుణంలో ఎన్నారైలతో పాటు మరికొందరు పారిశ్రామికవేత్తలు కూడా సీట్ల కోసం రంగంలోకి దిగారు. ఈ పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తున్న చంద్రబాబు ఆయా నియోజకవర్గాల్లో సొంత సర్వేలు నిర్వహించడంతోపాటు తన సొంత మనుషులను కూడా రంగంలోకి దింపి గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే 158 నియోజకవర్గాల సమీక్షలను పూర్తిచేసిన చంద్రబాబు మరో 17 నియోజకవర్గాలు ఇన్చార్జిలతో భేటీలను త్వరలోనే పూర్తి చేసి ఆ తర్వాత టికెట్లు ఖరారు ప్రాధాన్యత అంశాలపై దృష్టి పెట్టమన్నారు అయితే జనసేనతో పోత్తుల అంశం పూర్తిస్థాయిలో ఖరారు అయ్యాకే అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఎన్నికలకు మూడు నుంచి ఆరు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని యోచనలో చంద్రబాబు ఉన్నారు.