NewsTelangana

1000 డ్రా చేస్తే 2000 వేల నోటు… ఏటీఎంకు క్యూ కట్టిన జనం

సాంకేతిక లోపం కారణంగా ఏటీఎమ్‌ల పని తీరు వల్ల చాలా మంది ఇబ్బందికి గురవుతారు. కొన్నిసార్లు ఏటీఎంలో ఎంటర్‌ చేసిన అమౌంట్‌ తక్కువగా వస్తుంటాయి. మరి కొన్నిసార్లు అకౌంట్‌ నుండి డబ్బులు డెబిట్‌ అవుతాయి. కానీ డబ్బులు ఏటీఎం నుండి బయటికి రావు. కొన్నిసార్లు ఏటీఎం మెషీన్లు సాంకేతిక లోపం వల్ల విచిత్రంగా పని చేస్తాయి. అలాంటిదే ఓ సంఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. తాజాగా ఓ ఏటీఎంలో ఎంటర్‌ చేసిన అమౌంట్‌ కంటే ఎక్కువ డబ్బులు విత్‌డ్రా అయ్యాయి.  పట్టణంలో ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఏటీఎం సెంటర్‌లో రూ. 1000 డ్రా చేస్తే రూ. 2000 రావడం కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న కస్టమర్లు పెద్ద ఎత్తున ఏటీఎంకు క్యూ కట్టారు. అప్పటికే చాలా మంది డబ్బులు విత్‌డ్రా కూడా చేసుకున్నారు. అయితే ఈ విషయం ఆలస్యంగా బ్యాంకు అధికారులకు తెలిసింది. దీంతో వెంటనే ఏటీఎం సెంటర్‌ను మూసివేశారు. ఏటీఎంలో తలెత్తిన టెక్నికల్‌ ప్రాబ్లంను పరిష్కరిస్తున్నారు. అయితే.. అప్పటికే డబ్బులు డ్రా చేసుకున్న వారి నుంచి డబ్బులను ఎలా రికవరీ చేయాలన్న దానిపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.