థాయ్‌లో మునిగిన భారీ యుద్ధనౌక -గల్లంతైన సిబ్బంది
సముద్రంలో భారీ నౌక మునిగి పోయి, ప్రాణనష్టం సంభవించిన ఘటన మనం టైటానిక్ చిత్రంలో చూసాం. ఇలాంటి దుర్ఘటనే థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ భారీ యుద్ధనౌక ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగింది. ఇది ప్రచుప్ ఖిరి ఖాన్ ప్రావిన్స్‌లోని సముద్రతీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. వాతావరణ ప్రతికూలతల కారణంగా ఈదురుగాలులు బలంగా వీచడంతో సముద్రపు నీరు యుద్థనౌకలోకి చేరి విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. థాయ్ నౌకాదళం నుండి మూడు ఫ్రిగెట్లు, రెండు హెలికాఫ్టర్లు ప్రమాదస్థలానికి చేరుకున్నాయి. మొబైల్ పంపింగ్ మిషన్ల ద్వారా నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నించారు. ఇంజన్ పనిచేయకపోవడంతో నీరు భారీగా లోనికి వచ్చి, నౌక నెమ్మదిగా నీట మునిగింది. వాతావరణ ప్రతికూలతల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు తెలియజేస్తున్నారు.
ఈ ప్రమాదం సమయంలో నౌకలో 106 మంది నేవీ సిబ్బంది ఉన్నారు. వీరిలో 75 మంది నావికులను సహాయక సిబ్బంది కాపాడినట్లు సమాచారం. మిగిలన 31 మంది కోసం సహాయక, గాలింపు చర్యలు చేపట్టారు.

