‘SLBC టన్నెల్ ప్రమాదం ఎలా జరిగిందంటే’..మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట SLBC టన్నెల్ ప్రమాదం జరిగిన వెంటనే ప్రత్యేక విమానంలో నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు హుటాహుటిన సందర్శించారు. ఈ ఘటన ఎలా జరిగిందనే విషయం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో వెల్లడించారు. టన్నెల్‌లో నీరు లీక్ అవడం వల్లే మట్టి కుంగిందని పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు టన్నెల్‌లోకి కార్మికులు ప్రవేశించారు. అరగంట తర్వాత బోరింగ్ మిషన్‌ను ఆన్ చేశారు. వారు పనిచేస్తుండగా అకస్మాతుగా పైకప్పు కూలి మట్టిపెళ్లలు విరిగి పడ్డాయి. దీనితో కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. వారిలో 42 మంది బయటకు రాగా, 8 మంది టన్నెల్‌లోపలే చిక్కుకున్నారు. పెద్ద శబ్దం రావడంతో టీబీఎం ఆపరేటర్ ప్రమాదాన్ని ముందే పసిగట్టారని పేర్కొన్నారు. లోపల చిక్కుకున్నవారిలో ఒక ప్రాజెక్టు ఇంజనీరు, ఫీల్డ్ ఇంజినీరు, నలుగురు కార్మికులు, ఇద్దరు బోరింగ్ మిషన్ ఆపరేటర్లు ఉన్నారు. వారు 14 కిలోమీటర్ల లోపల ఇరుక్కు పోయారు. దీనితో వారిని తీసుకురావడం సవాలుగా మారిందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో గతంలో ఇలాగే రెస్క్యూ చేసిన ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడామని, వారికి తీసుకురావడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాం అని హామీ ఇచ్చారు.

