స్వాతంత్ర్య ఉద్యమ చరిత… ‘మనసర్కార్’ సగర్వ సమర్పణ
ఉద్యమాలు అగ్గి సెగలై రేగాయి. ఉక్కు పిడికిళ్ళెత్తి ఒక్కటై గర్జించాయి. మువ్వన్నెల పతాకాలనెగరేసి ముష్కరులపై కన్నెర్ర చేశాయి. దేశభక్తి ప్రబోధ గీతాలు అలలై ఎగసి పడ్డాయి. వందేమాతరం రణన్నినాదమై ప్రతిధ్వనించింది. ఎన్ని ప్రాణాలు నేల రాలినా.. ఎంత మంది ప్రాణాలను హరించినా . వెనకడుగు పడలేదు, వెన్ను చూపలేదు. గుండెలను చీల్చినా.. తుపాకీ గుండ్లెన్ని పేల్చినా ఆ మహోద్యమం ఆగలేదు. ఎన్ని తంత్రాలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు అల్లినా ఆ ఉద్యమాన్ని ఎవరూ ఆపలేక పోయారు. అడ్డుకోలేక పోయారు. ఇప్పటికి సరిగ్గా 75 ఏళ్లు గడిచాయి. నాటి యోధుల పోరు ఫలించి, స్వేచ్ఛ లభించి ఏడున్నర దశాబ్దాలు గడిచాయి. తెల్లదొరల దాస్య శృంఖాలాలను ఛేదించి 75 ఏళ్ళు నిండాయి. ఓ చీకటి కోణం నుండి బయటపడి స్వేచ్చా పరిమళాలు దేశమంతా పరివ్యాప్తమయ్యాయి. ప్రతి గుండె ఆనందంతో ఉప్పొంగింది. ప్రతి మదిలో సంతోషం తోణికిలాడింది. ఆనాటి రోజులను జ్ఞప్తికి తెచ్చుకుంటూ, నాటి సమర యోధులను స్మరించుకుంటూ అమృతోత్సవాలను జరుపుకుంటోంది.
ఆజాదీ కా అమృత మహోత్సవ్. ఇదే ఇప్పుడు ప్రతి నోట వినిపిస్తున్న మాట. ప్రతి చోట కనిపిస్తున్న మాట. దేశభక్తిని పరవళ్లు తొక్కిస్తున్న మాట. ఈ తరానికి ఓ స్ఫూర్తినిస్తున్న మాట. దేశానికి స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ఓ పెద్ద ఉత్సవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంతోమంది త్యాగఫలాలను, పోరాట గాథలను స్మరించుకునే ఓ గొప్ప ప్రక్రియకు నాంది పలికింది. వ్యాపార రీత్యా భారత్ గడ్డపై అడుగు పెట్టిన విదేశీయులు దేశంలోని అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు ఎన్నో సంవత్సరాల పాటు అతి నిరంకుశంగా పాలన సాగించారు. ఎంతో పైశాచికంగా వ్యవహరించారు. అడ్డొచ్చిన వారిని.. అడ్డుకున్న వారిని అతి కిరాతకంగా వేధించారు. ఈ చర్యలే ఓ తిరుగుబాటుకు ఆజ్యం పోశాయి. జాతీయోద్యమంగా రూపుదాల్చింది. మహోన్నతమై చెలరేగింది. అన్ని ప్రాంతాలను ఏకం చేసి.. తెల్లదొరలపై పోరు బావుటా ఎగరేసేలా చేసింది. ఈ మహా సంగ్రామంలో ఉద్యమ జ్వాలలను రగిలించిన వారెందరో ఉన్నారు. కవులు, కళాకారులు, విద్యావేత్తలు, వ్యాపారులు ఇలా ఒకరేమిటి.. ఎంతో మంది చైతన్యవంతమైన పాత్ర పోషించారు. క్రియాశీలకంగా వ్యవహరించారు. ఉద్యమమే ఊపిరిగా సాగారు. ప్రాణాలను పణంగా పెట్టారు. అంతిమంగా అనుకున్నది సాధించారు. ఆగస్ట్ 15న స్వాతంత్య్రాన్ని సముపార్జించి పెట్టారు.
అలా.. కాలం గిర్రున తిరిగి 75 ఏళ్లు గడిచాయి. ఆనాటి జాతియోద్యమాన్ని, అప్పటి ఘటనలన్నింటిని మననం చేసుకునేందుకే ఇప్పుడు అజాదీ కా అమృతోత్సవ్ ను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. జనోత్సవంగా జగజ్జేయమానంగా కొనసాగిస్తోంది. గతేడాది మార్చి 21న మొదలైన ఉత్సవాలు .. ఈ నెల 15తో పూర్తి కాబోతున్నాయి. ఇందుకు గాను ఏర్పాటు చేసిన జాతీయ అమలు కమిటీ ఇప్పటికే అనేక స్పూర్తివంతమైన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నాటి పోరాటంలో అజరామర ఘట్టంగా నిలిచిన దండియాత్రను గుర్తుచేసుకుంటూ సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు 350 కిలోమీటర్ల మేర ఓ పాదయాత్రను కూడా నిర్వహించారు. దాదాపు 25 రోజుల పాటు నిరాఘాటంగా సాగిన ఈ పాదయాత్ర అమృతోత్సవాలలో హైలెట్ గా నిలిచింది. అంతేకాదు.. దేశంలోని 16 ప్రముఖ చారిత్రక ప్రదేశాలలో ఇప్పటికే వేడుకలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని పిథోరా వద్ద మొదలైన వేడుకలు.. హుమాయున్ సమాధి, ఫతేపూర్ సిక్రీ, గ్వాలియర్, ముంబై, ఐజ్వాల్, లక్నో, ముంబై, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, వారణాశి, చిత్రదుర్గ, జైపూర్, అమరావతి, హైదరాబాద్ లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను కూడా వెచ్చించింది.
ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంగా ఈనెల 13 నుండి 15వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రజలందరూ తమతమ ఇళ్ళపై త్రివర్ణ పతాకాలను ఎగరేయాలని కూడా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అలాగే ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ ప్రొఫైల్ పిక్చర్ గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని కోరారు. ఇక జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యను స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు జరిగాయి. ఢిల్లీతో పాటు ఏపీలో కూడా వెంకయ్య పోరాట స్పూర్తిని, ఆయనలో నిబిడీకృతమైన దేశభక్తిని స్మరించుకుని, ఆ మహనీయునికి నివాళుల్పించారు. ప్రజలంతా పూర్తి అంకిత భావంతో తమతమ బాధ్యతలను నిర్వర్తిఁచినప్పుడే స్వాతంత్య్ర సమరయోధుల కలలను నేరవేర్చినట్లు అవుతుందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా దేశాన్ని నిర్మించడానికి సన్నద్ధులు కావాలని కూడా పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ అమృత మహోత్సవం ఓ ప్రభంజనంలా మారింది. ఈ తరానికి ఓ ఆలోచనను రగిలిస్తోంది. గతకాలపు పోరాటాలకు నిలయాలుగా ఉన్న ప్రాంతాలన్నీ సందర్శించాలన్న కోరికకు ఆజ్యం పోస్తోంది. అప్పటి ఉద్యమాల ప్రాముఖ్యతలను తెలుసుకోవాలన్న కాంక్షను కలిగిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే వేడుకలకు శ్రీకారం చుట్టింది. గతేడాది మార్చి 12న పబ్లిక్ గార్డెన్ లో జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించి .. అమృతోత్సవాలకు నాంది పలికారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఫ్రీడమ్ రన్, ఛాయచిత్ర ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశారు. ఘనంగా ఆజాదీ అమృతోత్సవాలను నిర్వహించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి.. అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులను ఇందులో భాగస్వాములను చేశారు. ఆగస్ట్ 15కి ముందు ఏడు రోజులు. ఆ తర్వాత 7 రోజలు. మొత్తంగా 15 రోజుల పాటు వజ్రోత్సవ ద్విసప్తాహం పేరుతో వేడుకలు నిర్వహించేందుకు సకల సన్నాహాలు చేశారు. ఇందుకు 25 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు తెలంగాణ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ భావాలు పాదుకొల్పాలన్న భావనతో 75 ప్రాంతాల్లో అతి పెద్ద జాతీయ పతాకాలను ఎగరవేశారు. ఇక అటు ఏపీలో కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు కొనసాగుతున్నాయి.
ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛకు కారకులు వారు. స్వాతంత్ర్య భారతానికి ఊపిరులూదింది వారు. ఆస్తులను, ఆత్మలను త్యాగం చేసింది వారు. అలాంటి పుణ్య చరితులను, త్యాగధనులను స్మరించుకోవడం.. వారికి నివాళులు అర్పించడం అందరి విధి. వారు అప్పగించిన బాధ్యతలు చిత్తశుద్ధితో పూర్తి చేయడం, భావి తరాలకు వారి కథలను, గాధలను తెలియ చెప్పడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఒకరోజు కాదు.. ఒక ఏడాది కాదు.. నిరంతరం ఓ స్రవంతిలా ఆజాదీ కా అమృతోత్సవాలు కొనసాగుతూనే ఉండాలి. ఆ ధన్యజీవులను, జాతీయ పోరాటంలో అసువులు అర్పించిన వీర యోధులను స్మరించుకుఁటూనే ఉండాలి. అదే వారికి మనమిచ్చే నిజమైన నివాళి. ఘన నివాళి.