లవ్ మ్యారేజ్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు అకారణంగా పోలీసుల రక్షణ కల్పించలేమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. వారి జీవితానికి నిజంగానే ముప్పు ఉంటేనే తప్ప భద్రత కల్పించలేమని వెల్లడించింది. పెళ్లిచేసుకున్న జంట ఒకరికొకరు అండగా నిలుస్తూ సమాజాన్ని ఎదుర్కోవాలని సూచించింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన శ్రేయ కేసర్వానీ పెద్దలను ఎదిరించి తన ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమకు రక్షణ కల్పించడంతో పాటు, తమ వైవాహిక జీవితంలో ఇతరులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఇటీవల శ్రేయ, ఆమె భర్త అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్య లు చేసింది.‘వీరి పిటిషన్ ను పరిశీలించిన తర్వాత ఈ జంటకు ఎలాంటి తీవ్రమైన ముప్పు లేదని తెలుస్తోంది.. ఈ పిటిషన్ పై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా ముప్పు ఉండే దంపతులకు మేం భద్రత కల్పిస్తాం.. సమాజాన్ని ఎదుర్కోవడం కోసం దంపతులిద్దరూ ఒకరికొకరు అండగా నిలబడాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

