InternationalNews

హార్ట్‌ ఎటాక్‌ను ఇలా దూరం పెట్టాలి..

హార్ట్‌ ఎటాక్‌.. గుండె నొప్పి.. ఈ పదం ఇప్పుడు అందర్నీ భయపెడుతోంది. గతంలో 50-60 ఏళ్లు పైబడిన వారికే హార్ట్‌ ఎటాక్‌ వచ్చేది. ఇప్పుడు 20 ఏళ్ల యువకుడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా గుండె నొప్పి వస్తోంది. తక్కువ వయసు వాళ్లూ హార్ట్‌ ఎటాక్‌తో చనిపోతున్నారు. ఇంతలా కలవర పెడుతున్న హార్ట్‌ ఎటాక్‌కు కారణం ఏంటి..? గుండె నొప్పిని గుర్తించడమెలా..? దీని నివారణ మార్గాలేంటి..?

పాశ్చాత్యపు ఆహారం వల్లే..

మన గుండె ‘లబ్‌డబ్‌’ అంటూ లయబద్ధంగా కొట్టుకుంటూ ఉంటేనే మనం సురక్షితంగా ఉన్నట్లు. ఆ గుండె ఒక్కసారి ఆగిపోయిందంటే మన జీవితానికి అక్కడితో ఫుల్‌స్టాప్‌ పడినట్లే. గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోవడానికి ప్రధాన కారణం మన జీవన శైలేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మన సంప్రదాయ అలవాట్లు, ఆహారపు విధానాలను వదిలేసి పాశ్చాత్యపు ఆహారానికి అలవాటు పడిపోవడమే ప్రధాన కారణం. మన పని విధానం కూడా మరో ముఖ్య కారణం.

రివర్స్‌ లైఫ్‌ స్టయిల్‌ ప్రమాదకరం..

హార్ట్‌ ఎటాక్‌తో ఇటీవల యువతే ఎక్కువగా చనిపోతున్నారు. ఏసీ గదుల్లో కంప్యూటర్‌ ముందు కూర్చొని ఉద్యోగాలు చేయడం.. రాత్రి పని చేస్తూ పగలు నిద్రపోవడం.. జంక్‌ఫుడ్‌కు అలవాటు పడి పండ్లు, కూరగాయలకు దూరంగా ఉండటం.. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోకపోవడం.. సెల్‌ఫోన్‌కు బానిస కావడం.. కొవిడ్‌ తర్వాత శ్వాసకోశ వ్యాధులు పూర్తిగా నయం కాకపోవడం.. వ్యాయామానికి సమయం కేటాయించక పోవడం వంటివే యువతలో గుండెపోటుకు ప్రధాన కారణాలు.

శరీరంలో రక్తం వేగం ఎంతో తెలుసా..?

నిజానికి.. మన గుండె నుంచి బయల్దేరిన రక్తం శరీరంలోని అన్ని భాగాలకు నిమిషానికి 43,20,000 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఊపిరితిత్తుల్లో రక్తం శుద్ధి అవుతుంది. అక్కడి నుంచి ధమనుల ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా అవుతుంది. నిమిషానికి ఐదు లీటర్ల చొప్పున రోజుకు ఏడున్నర వేల లీటర్ల మంచి రక్తాన్ని మన శరీరానికి అందజేస్తుంది. మన శరీరంలోని రక్తనాళాలు 60 వేల మైళ్ల పొడవు ఉంటాయి. మన గుండె కొట్టుకునే ప్రతిసారి రక్తం 60 వేల మైళ్లు ప్రవహిస్తుంది. సగటు జీవిత కాలంలో గుండె నుంచి 15 లక్షల బ్యారెల్స్‌ రక్తం సరఫరా అవుతుంది.

వ్యాయామం చేయాలి.. పండ్లు తినాలి..

ఉదయం నిద్రలేవగానే లేలేత సూర్యకిరణాలను చూస్తూ వ్యాయామం చేయాలి. దీంతో మనకు డీ విటమిన్‌ అందడంతో పాటు శరీరంలో రక్త ప్రసరణ వేగం కూడా పెరుగుతుంది. అప్పుడు గుండె జబ్బే కాదు.. ఏ జబ్బులూ దరి చేరవు. చాక్లెట్‌ తింటే గుండె జబ్బుల ప్రమాదం భారీగా తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నేరేడు పండ్లలో నైట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. దీంతో నేరేడు తినే వారిలో రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదమూ తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి..

మద్యపానం, పొగ తాగడం మానేయాలి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. నడకతో పాటు కనీసం అరగంట వ్యాయామం చేయాలి. నూనె సంబంధ ఆహారానికి దూరంగా ఉండాలి. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా పీచు పదార్ధాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. బీపీ, మధుమేహం ఉన్నవాళ్లు క్రమం తప్పకుండా మందులు వాడాలి. అప్పుడే గుండెపోటు మనదరికి చేరదు.