మునుగోడు ఎన్నికల గుర్తులపై నేడు హైకోర్టులో విచారణ
హైదరాబాద్, మనసర్కారు
మునుగోడులో ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతోంది. ఈ ఉపఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే అధికార పార్టీ టీఆర్ఎస్ ఎన్నికల్లో తమకు ఇబ్బంది కలిగించే అంశాలపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా కారును పోలిన గుర్తులపై టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ప్రధాన పార్టీలకు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఎలాగూ గుర్తులు ఉంటాయి. అయితే ఇండిపెండెంట్ల గుర్తులే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారాయి. అందులో కెమెరా, చపాతీ రోలర్, రోడ్ రోలర్లు, డోలీ, సబ్బు డిష్, ఓడ, టీవీ, కుట్టు మిషన్ గుర్తులు ఇంచుమించు కారు గుర్తును పోలి ఉన్నాయి. దీంతో నిరక్షరాస్యులు, వృద్ధ ఓటర్లు టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలనుకున్నవారు ఆ 8 గుర్తులలో దేనినైనా టీఆర్‌ఎస్ గుర్తు కారుగా అనుకుని పొరుపాటున ఇండిపెండెంట్లకు ఓటు వేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కారు గుర్తును పోలి ఉన్న 8 గుర్తులను మార్చాలంటూ న్యాయపోరాటానికి దిగారు. ఈ 8 గుర్తులను తొలగించాలంటూ హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై నేడు హైకోర్టు విచారణ జరపనుంది.