విశాఖలో ప్రధాని నరేంద్రమోడీకి ఘనస్వాగతం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజులు పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి విశాఖపట్నం కు వచ్చారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే సుమారు 48 నిమిషాల ఆలస్యంగా ప్రధానమంత్రి ఐఎన్ ఎస్ డేగాకు చేరుకున్నారు. అంతకుముందు ప్రధాని తమిళనాడు సభ ముగించుకొని అక్కడి నుంచి మధురై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ వర్షం కారణంగా ప్రధానమంత్రి రాకలో కొంత జాప్యం నెలకొంది. సాయంత్రం 6.25 కు గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లు ఐఎన్ఎస్ డేగాకు చేరుకొని ప్రధాని రాక కోసం ఎదురు చూశారు. రాత్రి 8.05 నిమిషాలకు ప్రధాని మోడీ ఐఎన్ఎస్ డేగా ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రి ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి తన సహచర మంత్రులను ఉత్తరాంధ్ర నేతలను ప్రధానికి పరిచయం చేశారు. ప్రధానమంత్రికి స్వాగత కార్యక్రమం పూర్తికాగానే ఐఎన్ఎస్ డేగా నుంచి మారుతీ జంక్షన్ కు ప్రధాని చేరుకున్నారు. అక్కడ నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ పొడవున భారీగా ఏర్పాటు చేసిన రోడ్ షోలో మోడీ పాల్గొన్నారు. రహదారి పొడవున బీజేపీ శ్రేణులు నేతలు మోడీ రోడ్ షో ను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా రహదారి ఇరువైపులా ఉన్న ప్రజలకు కార్యకర్తలకు ప్రధాని తన వాహనంలో నుంచే అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.
విద్యార్థులతో పాటు స్థానిక ప్రజలు కూడా స్వచ్ఛందంగా రోడ్డు షోకు తరలివచ్చారు. రోడ్ షోలో మోడీ ఉత్సాహంగా కనిపించారు. ప్రధాని రోడ్డు షో సందర్భంగా విశాఖలో కనివిని ఎరగని రీతిలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయమే రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఆ ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు సూచనలు చేశారు. శనివారం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో జరిగే పలు ప్రాజెక్టులు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు.