తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి శుభవార్త తెలిపింది. త్వరలోనే 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇప్పటికే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, 58 పాఠశాలలు, ఇందిరమ్మ ఇళ్లు ఉచిత సన్నబియ్యం, రైతు భరోసా, రైతు బీమా, ఆరోగ్యశ్రీ వంటి పలు సంక్షేమ పథకాలను శ్రద్ధగా అమలు చేస్తోంది. రాష్ట్రంలో దాదాపు రూ.95,000 కోట్లను సంక్షేమానికి వెచ్చిస్తున్నామని వెల్లడించిన భట్టి, సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.23,000 కోట్లు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఉచిత బస్సు టికెట్లు వంటి ఎన్నో కార్యక్రమాలను గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమం పట్ల కాంగ్రెస్ నిబద్ధతతో ఉన్నట్లు ఆయన తెలిపారు.

