NationalNews

భారత్ జోడో కాదు.. అలయన్స్ టోడో.. కూటమి శివసేన కటీఫ్

మహా వికాస్ అఘాడి సంకీర్ణంలో కొనసాగలేమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఒక ప్రకటన చేసాడు. అది శివసేన నుంచి వచ్చిన తీవ్రమైన ప్రతిస్పందన. అంతకు మించి ఇంకా మీకు ఏం కావాలన్నారు శివసేన ఎంపీ అరవింద్ సావంత్. కూటమిని కొనసాగించడం గురించి ప్రశ్నిస్తూ, జమ్మూ, కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ PDPతో బీజేపీ నాటి పొత్తుగా మొత్తం వ్యవహారాన్ని పరిగణించవచ్చని అంటోంది శివసేన. నాటి ఆ కలయిక, నేటి ఈ కలయిక రెండూ ఒకే విధమైనవంటోంది శివసేన. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ మాట్లాడుతూ, “సావర్కర్ సమస్య మాకు ముఖ్యమైనదన్నారు. ఆయన భావజాలాన్ని విశ్వసిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా ఈ విషయాన్ని కెలుక్కుందన్నారు.

మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ సావర్కర్‌ను “టార్గెట్” చేయలేదన్నారు. కానీ ఒక చారిత్రక వాస్తవాన్ని చెప్పారన్నారు. మొత్తం వ్యవహారంపై సంజయ్ రౌత్‌తో మాట్లాడానన్న ఆయన శివసేన అభ్యర్థనను అంగీకరిస్తున్నామన్నారు. ఇది మహా వికాస్ అఘాడిని బలహీనపరుస్తుందనే అభిప్రాయాన్ని ఖండించాడు. కూటమిపై సావర్కర్ ప్రభావం ఉండబోదన్నారు. 2019లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల తర్వాత శివసేన, కాంగ్రెస్, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)తో MVA పొత్తును ఏర్పరచుకున్నాయి. శివసేనకు ముఖ్యమంత్రి పీఠం లభించింది. కూటమిలో కాంగ్రెస్, ఎన్సీపీ భాగస్వామ్యపక్షాలుగా ఉన్నాయి. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి అసాధారణమైన సంకీర్ణాన్ని ఏర్పాటు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో శివసేనలో జరిగిన తిరుగుబాటుతో సంకీర్ణం కుప్పకూలింది. ఏక్నాథ్ షిండే మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాడు.


వినాయక్ దామోదర్ సావర్కర్ జైలులో ఉన్నప్పుడు బ్రిటీష్ వారి దయ కోరాడని విమర్శిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో శివసేన భగ్గుమంది. సావర్కర్ ఒక పిరికివాడని, ఆయనను కాంగ్రెస్ దిగ్గజాలు మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్‌లతో పోల్చాలేమంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. బాల్ థాకరే హిందూత్వ వారసత్వాన్ని తోసిపుచ్చలేమంటూ ఉద్ధవ్ థాకరే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. సావర్కర్ పట్ల శివసేనకి అపారమైన గౌరవం ఉందని అన్నారు. మొత్తం వ్యవహారంపై శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.