బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే.. టీఆర్‌ఎస్‌కు షాక్
తెలంగాణాలో బీజేపీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కృషి ఫలించడంతో వివిధ పార్టీల నాయకులు క్రమంగా బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. తాజాగా టీఆర్‌ఎస్‌కు షాక్ ఇస్తూ పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఉద్యమకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేసిన బిక్షపతి.. ఈ నెల 9వ తేదీన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యవాదిగా నిలిచి, ఉద్యమకారులను అణిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి ఇవ్వడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్మారెడ్డికి ఇక చుక్కలే..
త్యాగధనుల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వీఆర్‌ఏల సమస్యలను సైతం పట్టించుకునే తీరిక కేసీఆర్‌కు లేదని భిక్షపతి ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి చుక్కలు చూపిస్తానని సవాల్ చేశారు. కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత కూడా ఆ పార్టీ నుంచి వలసలు ఆగకపోవడం చర్చనీయాంశమైంది. కొంత కాలంగా టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉన్న భిక్షపతి బీజేపీ అగ్రనేత ఈటల రాజేందర్‌ను ఇటీవల కలిశారు. తెలంగాణాలో ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేయాలని రాష్ట్ర బీజేపీ కీలక నేతలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఇటీవల ఆదేశించారు.