ఏపీలో టీచర్లకు ముచ్చెమటలు
జగన్ సర్కారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా టీచర్లు నానా బాధలు పడుతున్నారు. నిన్న,మొన్నటివరకూ PRCల పేరుతో ఇబ్బంది పెట్టి జీతాల విషయంలో ఏడిపించిన ప్రభుత్వం కొత్తగా ఇప్పుడు గైర్హాజరు అయ్యే టీచర్స్ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉపాధ్యాయుల పాఠశాల హాజరులో భాగంగా కొత్త యాప్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం బోధన సిబ్బంది లేదా బోధనేతర సిబ్బంది కూడా ఈరోజు నుండి తప్పనిసరిగా ఫేషియల్ అటెండెన్స్ రూపంలో తమ సెల్‌ఫోన్‌లో స్కూల్ ఆవరణలో ఉదయం, సాయంత్రం హాజరును నమోదు చేయాలి. ఉదయం 9 లోపు హాజరు నమోదు చేయకపోతే యాప్ పనిచేయదు. ప్రధానోపాధ్యాయులు ఉదయం 10 గంటలలోపు ఈ యాప్‌లో ధ్రువీకరించాలి. దీనితో వీరు తప్పకుండా ఈముఖ ఆధారిత హాజరు వేయాల్సిందే. ఇప్పటికే ప్రతి పాఠశాలను జియోట్యాగ్ చేసారు. మొబైల్‌లో స్కూలుకు రాగానే పాఠశాలలో సెల్ఫీ తీసుకుని లొకేషన్ ఆన్ చేసి హాజరు నమోదుచేయాలి.
కాగా ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. చిత్తూరు జిల్లా ఫ్యాప్టో నాయకుడు దేవరాజుల రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల వ్యక్తిగత భద్రతకు ముప్పుగా ఉండే ఇలాంటి అటెండెన్స్ ఆప్‌ను వాడొద్దన్నారు. ఒక్కొప్పుడు పాఠశాలలో సెల్‌ఫోన్‌లు నిషేధించిన ప్రభుత్వం ఇప్పుడు అటెండెన్స్ కోసం సెల్ఫీలు తీసుకోవాలని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. ప్రభుత్వం హాజరుకు సంబంధించి ఏవైనా పరికరాలు పంపిణీ చేస్తే అప్పుడు వినియోగించవచ్చని అంతవరకూ రాష్ట్ర కమిటీ కార్యాచరణ ప్రకారం నడుచుకుందామని, ఎవ్వరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దని ఆయన చెప్పారు.
ఈ విషయంలో స్టేట్ SC, ST టీచర్స్ అసోసియేషన్ సామల సింహాచలం కూడా ఈ విధాన్నాన్ని ఇప్పుడే అమల్లోకి తేవద్దంటూ విద్యామంత్రి బొత్స సత్యనారాయణకు ఒక లేఖ రాసారు. ఈ విధానం అమలు కావడంలో ఎన్నో ఇబ్బందులున్నాయని, చిన్న,చిన్న గ్రామాలలో, మారుమూల ప్రాంతాలలో నెట్‌వర్క్ ఇబ్బందులు తలెత్తితే ఆయా ఉపాధ్యాయులకు హాజరు నమోదు అయ్యే అవకాశాలు తక్కువని మొరపెట్టుకుంటున్నారు. ఒక్క నిముషం ఆలస్యమైనా ఆరోజు సెలవు పెట్టినట్లు నమోదు అయిపోతుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. అయితే ఈ యాప్‌ను ఇప్పటి వరకూ డౌన్‌లోడ్ చేసుకున్న ఉపాధ్యాయుల సంఖ్య చాలా తక్కువగా ఉంది.