NewsTelangana

DAV స్కూలు లైసెన్సు రద్దు చేస్తూ విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు

హైదరాబాద్ : మనసర్కార్ :

బంజారాహిల్స్ డిఏవీ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై డ్రైవర్ లైంగిక దాడి విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,  హైదరాబాద్ డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని పేర్కొన్నారు. భద్రతకు  తగిన చర్యలు ప్రభుత్వానికి సూచించేటందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కమిటీకి విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వం వహిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. వారం లోగానే కమిటీ నివేదిక వస్తుందని, దాని మేరకు విద్యార్థుల భద్రతకు తగిన ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

ప్రస్తుతం డిఏవీ స్కూలులో చదువుతున్న విద్యార్థులను ఇతర పాఠశాలలో సర్దుబాటు చేయాలని డీఈవోను ఆదేశించారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను డీఈవో నివృత్తి చేయాలని, దానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్‌లో LKG  చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై అదే పాఠశాలలో ప్రిన్సిపల్ వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న రజనీ కుమార్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇదంతా ప్రిన్సిపల్ మాధవి గదికి సమీపంలోని డిజిటల్ రూమ్‌లోనే జరిగిందని తేలింది. ఈ విషయంలో ఆమె అడ్డుకోకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగిందనే కారణంగా ఆమెపై కూడా సెక్షన్ 21 పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, సీఐ నరేందర్‌లు మీడియా సమావేశంలో తెలియజేశారు. వారికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్‌ను విధించగా వారిని చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు సమాచారం.