NewsTelangana

మునుగోడు విజేతను నిర్ణయించేది యువతే..

మునుగోడు, మనసర్కార్‌: మునుగోడు ఎమ్మెల్యేను నిర్ణయించేది యువతే. ఈ నియోజక వర్గంలో మొత్తం 2,41,805 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 30 ఏళ్లలోపు వాళ్లే 59,563 మంది ఓటర్లు ఉన్నారు. ఇక 40 ఏళ్లలోపు వాళ్లు ఏకంగా 1,25,668 మంది ఉన్నారు. అంటే సగం మంది ఓటర్లు యువతే అన్నమాట. దీంతో యువత తీసుకునే నిర్ణయంపైనే తమ భవిష్యత్తు ఆధారపడి ఉందని అభ్యర్థులు అంటున్నారు. అందుకే ప్రచారంలో యువతను ఆకట్టుకునే హామీలపై ఫోకస్‌ పెడుతున్నారు. అన్ని పార్టీలు తమ యువజన, విద్యార్థి విభాగాల నాయకులను రంగంలోకి దించుతున్నాయి.

టీఆర్‌ఎస్‌పై యువత గరం..

8 ఏళ్లుగా పెద్దగా ఉద్యోగాలు కల్పించకపోవడం టీఆర్‌ఎస్‌కు మైనస్‌గా మారింది. నిరుద్యోగ భృతి ఇస్తామన్న కేసీఆర్‌ ప్రకటన కూడా నీటిపై రాతగానే మిగిలిపోయింది. పెన్షనర్లు తమను ఆదుకుంటారన్న ఆశ కూడా అడియాసే అయ్యేట్లు కనిపిస్తోందని టీఆర్‌ఎస్‌ నేతలు భయపడుతున్నారు. యువ ఓటర్లలో ఎక్కువ మంది ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు సీఎం కేసీఆర్‌కు ఇచ్చిన నివేదికలో స్పష్టం చేశారని తెలుస్తోంది. దీంతో కేటీఆర్‌ చొరవతో టీఆర్‌ఎస్‌ యువ నాయకులకు శిక్షణ ఇచ్చి మండలానికి 30 మంది చొప్పున ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు.

బీజేపీ వైపు యువత..

యువత ఎక్కువగా బీజేపీ వైపు నిలబడింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విజయానికి కృషి చేస్తామని యువకులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ లబ్ధిదారులపై టీఆర్‌ఎస్‌ నేతలు ఆశలు పెట్టుకున్నారు. పెన్షనర్లు 40 వేలలోపే ఉన్నారు. కాంగ్రెస్‌ తరఫున ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యానికి పాదాభివందనం’ పేరుతో ఇంటింటికీ వెళ్లి పెద్దవాళ్ల కాళ్లు మొక్కడంతో పాటు యువకులకు నచ్చ చెబుతున్నారు. బీజేపీ కూడా ఏబీవీపీ, బీజేవైఎం నాయకులను రంగంలోకి దించింది.

అరచేతిలో సమాచారం..

మెసేజ్‌లు, టెలీకాన్ఫరెన్స్‌లతో ఒకేసారి వందలాది మందిని ఓటు కోసం అభ్యర్థించేందుకు రాజకీయ పార్టీల నాయకులు స్మార్ట్‌ ఫోన్లను కూడా వినియోగిస్తున్నారు. ఓ పార్టీ 80 వేల వాట్సాప్‌ నెంబర్లు సేకరిస్తే.. మరో పార్టీ లక్షకు పైగా వాట్సాప్‌ నెంబర్లు సేకరించింది. ప్రచారాలు, ర్యాలీలు, ప్రసంగాలు, చర్చలు.. ఇలా అన్నీ సోషల్‌ మీడియాలో లైవ్‌ టెలికాస్ట్‌ చేస్తూ ప్రజలకు టీవీల కంటే ముందుగానే అరచేతిలో సమాచారాన్ని చేరవేస్తున్నారు.