రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దు
గ్రూప్-1 ఫలితాలపై రాజకీయ వివాదాలు ఆపాలని ర్యాంకులు సాధించిన అభ్యర్థుల తల్లిదండ్రులు వేడుకున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు కన్నీటి పర్యంతమయ్యారు.
ఒక్కో పోస్టు రూ.3 కోట్లు వెచ్చించి కొన్నామని మాపై ఆరోపణలు చేస్తున్నారని , మాలో చాలామంది కూటికి లేని వాళ్లం ఉన్నామని ఆవేదన చెందారు . రూ.3 కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా మాకు తెలియదని , పస్తులు పడుతూ పిల్లలను చదివించామని తప్పుడు ఆరోపణల వల్ల మా పిల్లలు ఏమైనా చేసుకుంటే బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్టు తీర్పు రాకముందే “పోస్టులు కొన్నారు” అన్న ఆరోపణలు చేయడం తప్పని వారు విమర్శించారు. “మా పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు సాధించారు. పోస్టులు కొన్నామన్న ప్రచారంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతోందని కాబట్టి ఎలాంటి విచారణకైనా సిద్ధమే కానీ మా పిల్లల భవిష్యత్తుపై రాజకీయాలు చేయవద్దు” అని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు మళ్లీ ఎన్నికలు పెట్టాలని కోర్టుకు వెళ్తారా? అలానే మా పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు?” అని తల్లిదండ్రులు ప్రశ్నించారు. పరీక్షలు రాసేందుకు ఇప్పటికే భారీ ఖర్చు పెట్టిన పరిస్థితిలో మళ్లీ పరీక్షలు రాయమని అడగడం అన్యాయమని పేర్కొన్నారు. “న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. మళ్లీ మెయిన్స్ లేదా ఫలితాలు రద్దు కావని గ్యారంటీ ఏంటి? నిన్నటి వరకు విజేతలుగా ఉన్న మా పిల్లలు ఇప్పుడు తలదించుకోవాల్సి వస్తోంది” అంటూ తల్లిదండ్రులు వాపోయారు.