NationalNews

కత్తితో కోసి.. 35 ముక్కలు చేసి.. ఢిల్లీ అంతటా విసిరేసి.. ప్రియురాలి దారుణ హత్య

ఢిల్లీలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సహజీవనం చేసిన యువతిని హతమార్చిన ప్రియుడు ఏకంగా 35 ముక్కలు చేసి దేశ రాజధాని ఢిల్లీ అంతటా వెదజల్లిన హృదయ విదారక ఘటన కిరాతకానికి పరాకాష్టగా నిలిచింది. పకడ్బందీగా చేసిన ఈ హత్యకు సంబంధించిన క్లూ దొరక్కుండా మృతదేహాన్ని కత్తితో 35 ముక్కలు చేశాడు. 300 లీటర్ల భారీ ఫ్రిజ్‌ కొనుక్కొని అందులో ఆమె శరీర భాగాలను భద్రపరిచాడు. ప్రేయసి మృతదేహం ముక్కలు ఫ్రిజ్‌లో ఉండగానే మరో ప్రేయసిని తన అపార్ట్‌మెంట్‌కు తీసుకొచ్చి ఆమెతో ఎంజాయ్‌ కూడా చేశాడు మానవత్వం లేని ఈ మృగాడు. రోజూ అర్ధరాత్రి 2 గంటలకు ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి ఒక్కో శరీర భాగాన్ని విసిరేసి వచ్చేవాడు. ఇంతటి పకడ్బందీ హత్య తర్వాత పోలీసులకు పట్టుబడినా ఆ కిరాతకుడిలో కాస్తంతైనా పశ్చాత్తాపం కనిపించక పోవడం దారుణం.

కాల్‌ సెంటర్‌లో పరిచయం.. మతాలు వేరు..

ముంబైలోని ఓ కాల్‌ సెంటర్‌లో పని చేసే శ్రద్ధా వాల్కర్‌ (26), ఆఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలా (28) మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మతాలు వేరు కావడంతో పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతానికి వెళ్లి ఓ అపార్ట్‌మెంట్‌లో సహజీవనం చేయనారంభించారు. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ ఒత్తిడి చేయడంతో మే నెల 18వ తేదీన ఆమెను ఆఫ్తాబ్‌ దారుణంగా గొంతు కోసి చంపేశాడు. విషయం బయట పడకుండా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ను కంటిన్యూ చేశాడు. అయితే.. శద్ధ ఫోన్‌ రెండు నెలలుగా స్విచ్‌ ఆఫ్‌ రావడంతో ఆమె స్నేహితురాలు శ్రద్ధ తండ్రి వికాస్‌ మదన్‌కు చెప్పారు. ఆఫ్తాబ్‌కు వికాస్‌ ఫోన్‌ చేసి అడిగితే.. శ్రద్ధతో తాను విడిపోయి చాలా కాలమైందని సమాధానం చెప్పాడు. వికాస్‌ నవంబరులో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా కేసును ఢిల్లీకి బదలాయించి అక్కడి పోలీసులు ఛేదించారు.

అమెరికన్‌ క్రైం షో చూసి స్ఫూర్తి..

ఆఫ్తాబ్‌తో ప్రేమ విషయాన్ని శ్రద్ధ తండ్రి పోలీసులకు తెలపడంతో ఆ దిశగా కేసు విచారణ ప్రారంభమైంది. నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రద్ధ శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు దుర్వాసన రాకుండా ఇంట్లో అగర్‌బత్తీలు కూడా వెలిగించే వాడని చెప్పాడు. అమెరికన్‌ క్రైం షో ‘డెక్ట్సర్‌’ నుంచి స్ఫూర్తి పొంది ఈ కిరాతకానికి పాల్పడినట్లు ఆఫ్తాబ్‌ అంగీకరించాడు. హతురాలి కొన్ని శరీర భాగాలు అటవీ ప్రాంతంలో లభించాయని పోలీసులు తెలిపారు. 5 రోజుల విచారణ కోసం పోలీస్‌ స్టేషన్‌ సెల్‌లో ఆఫ్తాబ్‌ను ఉంచారు. ఆ సెల్‌లో అతడు సుఖ నిద్ర పోయాడని.. అతనిలో ఆందోళన కనిపించక పోవడం విడ్డూరంగా ఉందని పోలీసులు చెప్పారు.