చంద్రబాబుకు తలనొప్పిగా వర్గపోరు
◆ అంతర్మథనానికి గురవుతున్న తెలుగు తమ్ముళ్లు
◆ టీడీపీకి నష్టం చేస్తుందంటున్న విశ్లేషకులు
◆ కోఆర్డినేషన్ కమిటీని నియమించిన చంద్రబాబు
◆ పలు నేతలకు సీరియస్ వార్నింగ్
తెలుగుదేశం పార్టీలో అనేక జిల్లాలలో పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు చంద్రబాబుకు తలనొప్పిగా మారుతోంది. అసలే అధికారం పోయి, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళ మధ్య కొనసాగుతున్న వర్గపోరు టీడీపీకి నష్టం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితిని పట్టించుకోకుండా, ఎవరికివారు ఆధిపత్య పోరులో పక్క వారికి చెక్ పెట్టాలని చేస్తున్న ప్రయత్నం తెలుగు తమ్ముళ్లకు ఇబ్బందికరంగా మారుతోంది. రాష్ట్రంలో
అధికారం లేక, అధికార పార్టీతో నిత్యం తల పడలేక, రోజుకో రకం సమస్యలతో, టీడీపీ నేతలపై కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధినేత చంద్రబాబు ఈ సమస్యను పరిష్కరించడానికి బాగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి అధికారంలో రావడానికి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది అధికారంలో లేకపోయినా మంచి ఊపులో ఉన్నామని భావిస్తున్న తెలుగు తమ్ములకు పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు కలవరపెడుతున్నాయి.
మహానాడు ఇచ్చిన స్ఫూర్తి కొత్త ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న క్యాడర్ నేతల మధ్య గొడవల కారణంగా వారు నైరాశ్యంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఏపీలోని అనేక నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు ఇప్పటికే చాలాసార్లు బయటపడుతూ వస్తున్నాయి ముఖ్యంగా రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం తూర్పుగోదావరి విశాఖ జిల్లాలోని నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయిన తరువాత అనేక నియోజకవర్గాల్లో అప్పటివరకు పదవులు అనుభవించిన ముఖ్య నేతలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అది భర్తీ చేసుకోవడానికి క్యాడర్‌ను జారిపోనివ్వకుండా ఉండటానికి చంద్రబాబు ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి కొత్త నేతలకు అవకాశం కల్పించారు. ఇప్పుడు మరలా పార్టీ పుంజుకోవటంతో పాత నేతలు అంతా పార్టీకి దగ్గర అవడంతో పాత కొత్త నేతల మధ్య విభేదాలు మొదలయ్యాయి.
ఇవి కాస్త ఆధిపత్య పోరుగా మారి అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టడంతో వాటిని చక్కదిద్దేందుకు చంద్రబాబు ముగ్గురు సీనియర్ నేతలతో కోఆర్డినేషన్ కమిటీని నియమించారు. ఇదే సమయంలో కోఆర్డినేషన్ కమిటీకి విస్తృతమైన అధికారాన్ని కూడా ఆయన ఇచ్చారు. దీంతో ఆ కమిటీ వరుస సమావేశాలను నిర్వహించి ఆయా ప్రాంతాల నేతలతో మాట్లాడుతూ సయోధ్య చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే చావుతప్పి కన్నులొట్టబోయినట్లుగా అధికారాన్ని పోగొట్టుకున్న టీడీపీ నేతలు ఒకటిగా కలిసి ముందుకు సాగకుంటే భవిష్యత్తులో కూడా ఏపీలోని అనేక జిల్లాలలో తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుగు తమ్ముళ్లు అంతర్మధనానికి గురవుతున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో తెలుగు తమ్ముళ్ళ మధ్య అంతర్గత విభేదాలు ఇంకా కొనసాగుతుండటంతో అధినేత చంద్రబాబు నాయుడు వాటిని ఏ విధంగా చెక్ పెడతారో వేచి చూడాల్సి ఉంది.