మునుగోడులో బోగస్ ఓట్ల కలకలం..!
టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నికల్లో బోగస్ ఓట్ల కలకలం మొదలైంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా మునుగోడులో ఓటు హక్కు కోసం కొత్తగా 25 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. సాధారణంగా ఎన్నికలకు ముందు కొత్త ఓటర్లుగా 2-3 వేల మంది చేరతారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నికలకు ముందు 1500 మందే కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. మునుగోడులో ఓటర్లకు ప్రధాన రాజకీయ పార్టీలు రూ.10 వేల చొప్పున పంచుతాయని ప్రచారం జరుగుతోంది. అంటే మూడు ప్రధాన పార్టీల నుంచి రూ.10 వేల చొప్పున రూ.30 వేలు వస్తాయన్న ఆశతో ఓటింగ్‌పై ఇంతకాలం ఆసక్తి కనబర్చని వాళ్లు కూడా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేశారని తెలుస్తోంది.

14వ తేదీ వరకు కొత్త ఓటర్లుగా దరఖాస్తు..
వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన మునుగోడు వాసులు కూడా తమ ఓటును ఇక్కడికి బదిలీ చేయాలంటూ దరఖాస్తు చేయడం విశేషం. వారితో పాటు 18 ఏళ్లు నిండిన యువత, ఇటీవల పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చిన కొత్త కోడళ్లు సైతం ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి ఎన్నికలకు ముందు అప్పటికే ఉన్న ఓటర్లలో 2 శాతం కొత్తగా చేరతారు. కానీ.. ఇక్కడ ఏకంగా 12 శాతం కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకోవడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఉప ఎన్నికల నామినేషన్ల చివరి రోజు అయిన ఈ నెల 14వ తేదీ వరకు కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. 14వ తేదీన ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు.

బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పరస్పర ఆరోపణలు..
బీజేపీ నేతలు బోగస్ ఓటర్లతో హైదరాబాద్ నుంచి భారీ స్థాయిలో దరఖాస్తు చేయించారని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఓట్ల తొలగింపు, కొత్త ఓట్ల దరఖాస్తుల కోసం టీఆర్‌ఎస్ నేతలు ఒక ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అండతో టీఆర్‌ఎస్, కేంద్ర ప్రభుత్వ అండతో బీజేపీ బోగస్ ఓట్లను ఇబ్బడి ముబ్బడిగా చేర్చాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పరస్పర ఫిర్యాదులతో ఎన్నికల అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొత్తగా చేర్చిన 12 శాతం ఓటర్లతో ఎన్నికల ఫలితాలే మారిపోయే పరిస్థితి నెలకొనడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.