NationalNews

రామాయణంపై పోటీలు.. ముస్లిం యువకులు విజేతలు

Share with


భాష ఏదైతేనేం.. నేర్వాలన్న తపనుంటే చాలు ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. మతమేదైతేనేం .. ఎదుటి వారిని చూసే కోణం సరిగ్గా ఉంటే చాలు ఎన్నో హృదయాలను గెలుచుకోవచ్చు. కఠోర శిక్షణ, రోజుల కొద్దీ సాధన తోడైతే చాలు విజయం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. అదే ఇప్పుడు వారు సాధించారు. ఎంతో మందిలో ఆలోచన రేకెత్తించారు. స్పూర్తి మంత్రంగా మారారు. ఆదర్శంగా నిలిచారు. ఇంతకీ వారు సాధించిందేమిటీ ? ఎందుకు వారికింత పేరు ?


ఇతిహాసాలను ఒంటబట్టించుకోవడం అంటే మాటలు కాదు. రామాయణ, భారత, భాగవతాలలో ప్రవేశం కలిగి ఉండడం అంటే మామూలు విషయం కాదు. సంస్కృత పదాలపై పట్టు, ఉచ్ఛారణలో బిగువు ఎంతో అవసరం. అలాంటి కష్టసాధ్యమైన పనిని ఇష్ట సాధ్యంగా మలుచుకున్నారు ఆ యువకులు. అంతేకాదు .. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, సనాతన ఆచార వ్యవహారాలను తెలియ చెప్పే గ్రఁధాలను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాల్సిందేనంటూ పిలిపునిచ్చారు. కేరళలోని డీసీ బుక్స్ అనే సంస్ధ రామాయణంపై ఆన్ లైన్ లో నిర్వహించిన పోటీలలో మలప్పురం కు చెందిన మొహమ్మద్ జబీర్ , మొహమ్మద్ బాసిత్ విజేతలుగా నిలవడం తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. మొత్తం వెయ్యి మంది వరకు ఈ పోటీలలో పాల్గొంటే ఐదుగురు విజేతలుగా నిలిచారు. వారిలో జబీర్, బాసిత్ అగ్ర స్ధానంలో నిలవడం సంచలనంగా మారింది.


క్విజ్ పోటీలలో విజేతలుగా నిలిచిన జబీర్, బాసిత్ ఇద్దరూ వాలెంచెరీలోని కేకేఎస్ఎం ఇస్లామిక్ కళాశాలలో అన్ని మత బోధనలతో కూడిన వాఫీ కోర్సు అభ్యాసం చేస్తున్నారు. హిందూ మతం, దాని పుట్టుపూర్వోత్తరాలు, ఆ మతానికి సంబంధించిన అన్ని గ్రంధాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఇదే వారికి భారత, భాగవత, రామాయణాలపై పట్టు పెంచేలా చేసింది. ఆయా గ్రంధాలలోని శ్లోకాలను వాటి సారాంశాలను కంఠోపాఠంగా అప్పజెప్పగల స్ధాయి వారిది. ఇస్లాం మతానికి సంబంధించిన అన్ని అంశాలతో పాటు హిందుత్వం, బౌద్ధం, జైనమతం, సిక్కు, క్రైస్తవ మతాల గురించి ఎనిమిది సంవత్సరాల కోర్సు లో వారు అనేక కోణాలలో ఆయా గ్రంధాలను పరిశీలిస్తున్నారు. టావోయిజంపై కూడా అవగాహన పెంచుకుంటున్నారు.


భారత్ అంటేనే భిన్న మతాల సమ్మిళితం. విభిన్న సంస్కృతుల సమ్మేళనం. అందుకే అన్ని మతాల గురించి అధ్యయనం చేసేలా కేకేఎస్ఎం కళాశాలలో ఓ ప్రత్యేకమైన కోర్సును డిజైన్ చేశారు. అందులో బజీర్, బాసర్ లు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. వేదాంత శాస్ర్తంపై కూడా విశేష అవగాహన పెంచుకున్నారు. మరికొంతమంది విద్యార్ధులు పీహెచ్.డీ కూడా చేస్తున్నారు. రామాయణంలో ఎంతో గొప్పదనం ఇమిడీకృతమై ఉందని అంటారు జబీర్, బాసిత్. ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వం, త్యాగ నిరతి వంటి ఎన్నో అంశాలు రామాయణంలో కనిపిస్తాయని అంటున్నారు. జనరంజకమైన పాలన, సమధర్మం, సమ న్యాయం వంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు రామాయణ గ్రంధంలో ఉన్నాయని చెబుతున్నారు. కేవలం కళాశాలలో ఉన్న గ్రంధాలయంలోనే కాక.. ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నామని జబీర్, బాసిత్ చెబుతున్నారు. అందుకే తమను విశేషంగా ఆకట్టుకున్న, ఆకర్షించిన గ్రంధం రామాయణమే అంటున్నారు. కేవలం విషయాన్ని అధ్యయనం చేయడమే కాదు.. ఆయా శ్లోకాలను శబ్ద దోషాలు లేకుండా పఠించడాన్ని కూడా వారు వెన్నతో పెట్టినట్లు నేర్చారు. ఏ మతమైనా చెప్పే సారాంశం ఒక్కటే.. సర్వమానవ సౌభ్రాతృత్వమేనని తమ అధ్యయనంలో తెలుసుకున్నట్లు చెబుతున్న మొహమ్మద్ జబీర్ , మొహమ్మద్ బాసిత్ పైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది.