InternationalNews

రంగు మార్చుకుంటున్న స్ప్రైట్ కూల్ డ్రింక్

Share with

60 ఏళ్ల తర్వాత గ్రీన్​ ను వదిలేస్తోంది..

ఇంట్లో ఉన్నా.. ఎక్కడైనా బయటికి వెళ్లినా కూల్ డ్రింక్స్ తాగడం చాలా మందికి అలవాటే. అందులోనూ మన ప్రాంతాల్లో అయితే థమ్సప్ లేదంటే స్ర్పైట్ అన్నట్టుగా ఉంటుంది డిమాండ్. పాన్ షాపులు మొదలుకుని భారీ మాల్స్ వరకు కూల్ డ్రింక్స్ ను వరుసగా పేర్చి పెట్టడం, వాటి వైపు చూడగానే ఏది ఏమిటనేది ఠక్కున గుర్తు పట్టడం కూడా మామూలే. కాస్త ఆకుపచ్చ రంగు బాటిల్ లో ఉండే స్ర్పైట్ ను చాలా ఈజీగా గుర్తుపట్టేస్తుంటాం. ఇప్పుడా అప్పుడా ఏకంగా 60 ఏళ్లుగా స్ర్పైట్ అదే ఆకుపచ్చ రంగు బాటిళ్లలో వస్తోంది మరి. ఇన్నేళ్లలో బాటిళ్ల ఆకారం మారినా.. స్ర్పైట్ ఉండే ఆకుపచ్చ రంగు మాత్రం మారలేదు. కానీ ఇప్పుడు ఆ ఆకుపచ్చ రంగుకు స్ర్పైట్ గుడ్ బై చెప్పేస్తోంది. స్ర్పైట్ బ్రాండ్ ను ప్రమోట్ చేసే కోకకోలా కంపెనీ ఈ మేరకు తాజాగా ప్రకటన చేసింది.

ఇక ముందు స్ర్పైట్ బాటిల్ సాధారణ పారదర్శక ప్లాస్టిక్ బాటిళ్లలో రానుంది. అసలే నీళ్లలా ట్రాన్స్ పరెంట్ గా ఉండే ఈ కూల్ డ్రింక్ ఇప్పుడు చూడటానికి సోడా బాటిళ్లలా కనిపించనుంది.

అయితే స్ర్పైట్ బాటిల్ రంగును తొలగించినా.. దాని లోగో, మూత మాత్రం ఆకుపచ్చ రంగులోనే ఉండనున్నాయి. లోగోను మాత్రం కాస్తంత మార్చారు.

పునర్వినియోగానికి (రీసైక్లింగ్)కు వీలుగా ఉండేలా రంగుల్లేని ప్లాస్టిక్ ను ఉపయోగించాలని నిర్ణయించడమే.. స్ర్పైట్ బాటిల్ రంగును మార్చడానికి కారణమని కోకకోలా సంస్థ ప్రకటించింది. పర్యావరణానికి అనుకూలంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

ప్రస్తుతానికి అమెరికాలో స్ర్పైట్ కలర్ ను మార్చినట్టు ప్రకటించిన కోకకోలా సంస్థ.. తర్వాత దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అమలు చేస్తామని తెలిపింది.