త్వరలో రాజధాని మార్పు
◆ ప్లీనరీ సక్సెస్ కావడంతో సీఎం జగన్ దూకుడు
◆ విశాఖకు తరలనున్న క్యాంపు కార్యాలయం
◆ ఉత్తరాంధ్రలో పార్టీ పటిష్టతపై దృష్టి
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖను పరిపాలన రాజధానిని చేస్తామని గతంలో ప్రకటించిన జగన్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేసింది.అయితే కోర్టు కేసులు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో విశాఖకు రాజధాని తరలించే అంశం అప్పట్లో బ్రేక్ పడింది.అయితే ఈ విషయంలో జగన్ సర్కార్ మరోసారి దూకుడు పెంచడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. సీఆర్డీఏ కేసులకు రాజధాని తరలింపునకు సంబంధం లేదని అతి త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని మారబోతున్నట్లు ఆ పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డి,వై.వి సుబ్బారెడ్డి ఇటీవల కాలంలో ప్రకటిస్తూ వస్తున్నారు. దీంతోపాటు గడిచిన రెండు మూడు నెలలుగా వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు మాట్లాడుతున్న మాటలు ఆయన పాలనలో వేగం పెంచుతున్నట్లు కనిపిస్తుంది. అలానే ప్లీనరీ కూడా భారీ సక్సెస్ కావడంతో మంచి ఉత్సాహంతో సీఎం జగన్ విశాఖ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే రెండు మూడు నెలల్లో విశాఖపట్నంలో తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. మూడు రాజధానులపై కోర్టు కేసు ఉన్నందున రాజధాని తరలించే అవకాశం లేదు.ఈ నేపథ్యంలో తన క్యాంప్ కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేసి ప్రతిపక్షాలకు తన మార్క్ రాజకీయం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కోర్టు తీర్పును గౌరవిస్తునే క్యాంప్ కార్యాలయాన్ని మాత్రం మార్చాలని భావనలో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. పరిపాలనా రాజధాని విశాఖకు మారిస్తే ఉత్తరాంధ్రలో పార్టీకి మంచి మైలేజ్ వచ్చి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన భావిస్తున్నారు.
గతంలో కూడా పలుమార్లు రాజధాని తరలింపునకు సంబంధించిన ప్రచారం జరిగింది. కానీ కచ్చితంగా రెండు నెలల్లో విశాఖపట్నం కు రాజధాని తరలింపు ఉంటుందని అందరూ భావిస్తున్నారు.ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖపట్నం త్వరలో పరిపాలన రాజధాని కానుందని ఉమ్మడి విశాఖ వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ప్రకటించిన నేపథ్యంలో మరి ఏమి జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.