NewsTelangana

అప్పు లెక్క తేలడంలా… బడ్జెట్‌లో కోతలు తప్పవా?

Share with

ఈ ఆర్థిక సంవత్సరం తెలంగాణాకు కేంద్రం నుండి అంతగా అప్పు పుట్టలేదన్న విషయం తెలిసిందే. అయితే అనుకన్నంత అప్పు పుట్టని కారణంగా  రాష్ట్ర బడ్జెట్‌లో ఈసారి ఎంత కోత విధించనున్నారన్న అంశంపై చర్చ సాగుతోంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన అప్పు లెక్క తేల్చేశారు. దీంతో ఈ సారి రాష్ట్రబడ్జెట్‌లో ఎంత కోత విధించనున్నారు అనే ప్రశ్నకు తెరపడింది. ఆ లెక్కను బట్టి ఈ ఆర్ధిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ లో ఎంత కోత ఉంటుందో తేలితోంది. ఇటీవల గ్యారెంటీ అప్పులపై కేంద్రం విధించిన ఆంక్షల నేపథ్యంలో  ఈ సారి రాష్ట్రానికి ఇంత రావచ్చు… అంత రావచ్చు అని ఎన్నో లెక్కలు వచ్చాయని… కానీ వాస్తవంగా వచ్చేది రూ.23 వేల కోట్లేనని సీఎం కేసీఆర్ ప్రకటనతో స్పష్టం అయ్యింది. సీఎం కేసీఆర్ ప్రకటన నిజమైతే ఈసారి రాష్ట్రబడ్జెట్‌లో భారీ కోత తప్పదని స్పష్టమవుతుంది. ఎందుకంటే 2022-23  ఆర్ధికసంవత్సరానికి గాను రాష్ట్రప్రభుత్వం రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టింది.అందులో 53,970 కోట్లు అప్పు తీసుకుంటామని తెలిపింది. అలాగే వివిధ కార్పొరేషన్‌ల కోసం గ్యారెంటీ అప్పులను కూడా బడ్జెట్‌లో పొందుపరిచింది. వీటిలోట్రాన్స్‌కో,జెన్‌కో,డిస్కంలకు రూ.12,198.70 కోట్లు,సాగునీటి ప్రాజెక్టుల కార్పొరేషన్‌‌లకు రూ.22,675.07… రెండు కలిపి 34,873.14 కోట్లు అప్పు తీసుకుంటామని ప్రతిపాదించారు.

దీని ప్రకారం బడ్జెట్ అప్పులు, గ్యారెంటీ అప్పులు కలిపి దాదపు రూ.88,843 కోట్లు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు సంబంధించిన నీతి అయోగ్ సిఫారసుల నేపథ్యంలో కేంద్రం నుంచి రూ.40 వేల కోట్ల దాకా గ్రాంట్ల కింద వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇది కూడా కలిపితే రూ. 1.28 లక్షల కోట్లు. నిజానికి వీటిలో ఏవేవి ఎంతెంత వస్తాయో అంచనా వేస్తే… బడ్జెట్ అప్పు కింద వేసిన అంచనా రూ.53,970 కోట్లు కాగా నికరంగా వచ్చేది రూ.23 వేల కోట్లేనని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇక గ్యారెంటీ అప్పుల లెక్క భారీగా రూ.34 వేల కోట్ల వరకు ఉండగా… వాస్తవంగా వచ్చేది రూ.10 వేల కోట్లేనని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా గ్రాంట్ల విషయంలో కూడా గత ఏడాది అనుభవాన్ని బట్టి చూస్తే రూ.10వేల కోట్ల లోపే రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. మూడూ కలిపితే నికరంగా వచ్చేది దాదాపు రూ.43 వేల కోట్లే. వస్తుందనుకున్నదానికి …వస్తున్నదానికి మధ్య రూ.85 వేల కోట్లు తేడా ఉందని తెలుస్తుంది.