రాఖీ కోసం ఊరిబాట పట్టిన నగరం
హైదరాబాద్‌నుండి బస్సులో ఏఊరైనా వెళదామనుకుంటున్నారా.. అయితే మీపని గోవిందా, ఎందుకంటే అకస్మాత్తుగా బస్సు స్టేషన్లన్నీ చాలా రద్దీగా మారాయి. ఈ రద్దీకి కారణం ఈరోజు రాఖీ పౌర్ణమి కావడమే. అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు అక్కచెల్లెళ్లు ఊర్లకు బయలుదేరుతున్నారు. వీకెండ్ కావడం కూడా దీనికి తోడయ్యింది. ఈనెల 17 న చాలా పెళ్లిముహూర్తాలు కూడా ఉండడంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌తో పాటు ఎంజీబీఎస్, ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి, జేబీఎస్ మొదలైన బస్సు స్టేషన్లలో చాలా హడావుడిగా నెలకొంది. అంతేకాక వర్షాలు పడుతుండడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల వంటి ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసారు. దీనితో వాటిని చూడడానికి వెళ్లేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. వాతావరణం కూడా ఆహ్లాదంగా ఉండడంతో విహారయాత్రలు కూడా పెరిగాయి. కొందరు లాంగ్ డ్రైవ్‌లకు కూడా బయలుదేరారు. దగ్గరలోని జలపాతాలకు, సందర్శనా స్థలాలకు కూడా ప్రయాణాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రాఖీకి సెలవు ప్రకటించడంతో రెండవశనివారం, ఆదివారం, సోమవారం ఇలా వరుసగా 4రోజులు సెలవులు కలిసి రావడంతో తమవారిని కలిసేందుకు నగరవాసులు బస్సుల బాట పట్టారు.