చండీగఢ్ మేయర్ ఎన్నిక నిర్వహించిన అధికారిని ప్రాసిక్యూట్ చేయాలన్న సుప్రీం కోర్టు
చండీగఢ్ మేయర్ ఎన్నికల వివాదంపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “ప్రజాస్వామ్య హత్య”ను అనుమతించబోమని ప్రకటించింది. ఎన్నిక ప్రాసెస్ రికార్డులను భద్రపరచాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. ఈ కేసును ఫిబ్రవరి 12న కోర్టు విచారించనున్నట్టు పేర్కొంది. గత నెలలో జరిగిన మేయర్ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓడిపోయిన అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ… ప్రిసైడింగ్ అధికారి ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారని ఆరోపించింది. బ్యాలెట్ పేపర్లను ట్యాంపరింగ్ చేసినందుకు అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. ఎనిమిది ఓట్లు చెల్లవని ప్రకటించి… ఎన్నిక ఆప్-కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఎన్నికలను బిజెపికి అనుకూలంగా మార్చారని బీజేపీ మండిపడింది. మేయర్ ఎన్నిక జరిగిన తీరుకు నిరసనగా ఆప్ పార్టీ, ఢిల్లీ-చండీగఢ్‌లలో మెగా నిరసనలు నిర్వహించింది. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ బ్యాలెట్ పత్రాలను పాడు చేస్తూ కెమెరాలో చిక్కుకున్నారని వాదిస్తూ కోర్టుకు వెళ్లింది.

ఆప్ ఎంపి రాఘవ్ చద్దా మాట్లాడుతూ, ఎన్నికల అధికారి మసీహ్ “చెల్లని”గా ప్రకటించిన మొత్తం ఎనిమిది ఓట్లు తమ పార్టీ అభ్యర్థికి చెందినవని పేర్కొన్నారు. ఆ ఓట్లను లెక్కించి ఉంటే ఆప్ గెలిచి ఉండేదన్నారు. బీజేపీ కార్యకర్తలు బ్యాలెట్ పత్రాలను చించివేశారని, తమ ఏజెంట్‌ను చూసేందుకు అనుమతించలేదని కాంగ్రెస్ ఆరోపించింది. రిటర్నింగ్ అధికారి చేసిన పని ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్లేనని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అన్నారు. ” కెమెరాలోకి చూస్తూ బ్యాలెట్ పేపర్‌ను పాడుచేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి” అని ఆప్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి అన్నారు.

చండీగఢ్ నగర బడ్జెట్ సెషన్‌ను సైతం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం సమర్పించాలని భావిస్తున్న బడ్జెట్ ప్రతిపాదనలను స్తంభింపజేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బడ్జెట్‌ను సమర్పించొద్దని న్యాయమూర్తులు తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగలేదని ఆప్ తన పిటిషన్‌లో పేర్కొంది. బ్యాలెట్ పేపర్లను తారుమారు చేసి బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయని ఆప్ ఆరోపించింది.

ఎన్నికలను రద్దు చేయాలని, రికార్డులను సీల్ చేయాలని, మేయర్‌ను పదవీ బాధ్యతలు స్వీకరించకుండా నిషేధించాలని, రిగ్గింగ్‌పై విచారణ జరిపి, హైకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో తాజాగా ఎన్నికలు నిర్వహించాలని ఆప్ పిలుపునిచ్చింది. పంజాబ్ – హర్యానా హైకోర్టుకు చెందిన జస్టిస్ సుధీర్ సింగ్, జస్టిస్ హర్ష్ బంగర్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించడంతో ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిజెపి అభ్యర్థి మనోజ్ సోంకర్ ఆప్‌కి చెందిన కుల్దీప్ కుమార్‌ను ఎన్నికల్లో ఓడించాడు. బీజేపీ అభ్యర్థికి 16 ఓట్లు రాగా… ప్రత్యర్థికి 12 ఓట్లు వచ్చాయి. ఎనిమిది ఓట్లు చెల్లవని ప్రకటించారు. 35 మంది సభ్యులున్న కార్పొరేషన్‌లో బీజేపీకి 14 మంది, ఆప్‌కి 13, కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారు.

