హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్ కలకలం
హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువైపోతున్నాయి. హైదరాబాద్ పోలీసులు ఎన్నో విధాలుగా వీటిని అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ నగరంలో ఇటువంటి ఘటనలు తరచూ ఎక్కడో ఓ చోట పునరావృతమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నగరంలో లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిన యువకులే ఎక్కువగా వీటికి పాల్పడుతున్నట్లు పోలీసుల సర్వేలో తేలింది. వీరు నగరంలో ముందుగా జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుంటారు. ఈ ప్రాంతాలలో రోడ్డుపై ఒంటరిగా వెళ్లే మహిళలు,వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని ఎంతో చాకచక్యంగా చైన్ స్నాచింగ్‌లు చేస్తుంటారు. ఈ తరహాలోనే ఈ రోజు నగరంలోని గోపాలపురంలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఈ ఘటనలో దుండగుడు మహిళ మెడలో నుంచి చైన్ లాక్కెళ్లినట్లు సమాచారం. ఈ ఘటన గోపాలపురం సిగ్నల్ వద్ద చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డైయ్యాయి. దీనిని గమనించిన పోలీసులు దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

