NationalNews

పీఎఫ్‌ఐపై కేంద్రం ఐదేళ్ల నిషేధం

పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)పై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. దేశవ్యాప్తంగా పీఎఫ్‌ఐ కార్యకలాపాలను ఐదేళ్ల పాటు నిషేధిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం తెల్లవారుజామున ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని.. ఐదేళ్ల తర్వాత పీఎఫ్‌ఐ కార్యకలాపాలను పరిశీలించి నిషేధంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నది. ప్రధాని మోదీ జపాన్‌ పర్యటన నుంచి ఢిల్లీకి వచ్చిన కొన్ని నిమిషాల్లోనే పీఎఫ్‌ఐపై, దాని అనుబంధ సంస్థలపై నిషేధం విధించడం విశేషం.

ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు..

ఇంటెలిజెన్స్‌ నివేదిక ప్రకారం.. గల్ఫ్‌ దేశాల్లో ఇండియా ఫ్రటర్నిటీ ఫోరమ్‌, ఇండియన్‌ సోషల్‌ ఫోరమ్‌, రిహాబ్‌ ఇండియన్‌ ఫౌండేషన్‌ అనే మూడు సంస్థలను పీఎఫ్‌ఐ నడుపుతోంది. పీఎఫ్‌ఐకి చెందిన కొందరు కార్యకర్తలు ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా(ఐసిస్‌)లో చేరి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నారని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాతుల్‌ ముజాహిదీన్‌తో కూడా పీఎఫ్‌ఐకి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నది. దేశంలో క్రిమినల్‌, ఉగ్రవాద కేసుల్లో పీఎఫ్‌ఐ కార్యకర్తలకు ప్రమేయం ఉందని, విదేశాల నుంచి భారీ స్థాయిలో నిధులు అందుతున్నాయని ఈడీ ధ్రువీకరించింది.

పీఎఫ్‌ఐ అనుబంధ సంస్థలపైనా నిషేధం..

ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందించడంతో పాటు యువతకు శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలపై పీఎఫ్‌ఐతో పాటు రిహాబ్‌ ఇండియా ఫౌండేషన్‌, క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, ఆల్‌ ఇండియా ఇమామ్స్‌ కౌన్సిల్‌, నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌, నేషనల్‌ ఉమెన్స్‌ ఫ్రంట్‌, జూనియర్‌ ఫ్రంట్‌, ఎంపవర్‌ ఇండియా ఫౌండేషన్‌ అండ్‌ రిహాబ్‌ ఫౌండేషన్‌, దాని అనుబంధ సంఘాలపైనా కేంద్రం నిషేధం విధించింది.

2007లో ప్రారంభమైన పీఎఫ్‌ఐ..

సిమిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత 2007లో కేరళలోని నేషనల్‌ డెమొక్రాటిక్ ఫ్రంట్‌, కర్నాటకలోని ఫోరం ఫర్ డిగ్నిటీ, తమిళనాడులోని మనితా నీతి పసరాయ్‌ సంస్థలు కలిసి పీఎఫ్‌ఐని స్థాపించాయి. నిషేధిత సిమికి మరో రూపమే పీఎఫ్‌ఐ అని 2012లో నాటి కేరళ సీఎం ఊమెన్‌ చాందీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. పీఎఫ్‌ఐ ఎన్నికల్లో పాల్గొనదు. 2009లో స్థాపించిన సోషల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎస్‌డీపీఐ) అనే రాజకీయ పార్టీ ఎన్నికల్లో పాల్గొంటుంది. దానికి పీఎఫ్‌ఐ వెనక నుంచి అండగా నిలుస్తుంది. ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఎస్‌డీపీఐ స్థానిక సంస్థల సీట్లను కూడా గెలుచుకుంది.