మంత్రి గంగులకు సీబీ’ఐ’ నోటీసులు
మైనింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఈడీ దాడులతో సతమతమవుతున్న తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు సీబీఐ నోటీసుతో షాక్ ఇచ్చింది. గంగుల ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు మంత్రితో పాటు గాయత్రి గ్రానైట్స్ అధినేత, ఎంపీ రవిచంద్రకు కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సీబీఐకి హైదరాబాద్‌లో ప్రవేశం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో వారిని ఢిల్లీలో విచారించనున్నట్లు తెలుస్తోంది. సీబీఐ అధికారిగా చెప్పుకుంటూ ఢిల్లీలో అరెస్టు అయిన కొవ్విరెడ్డి శ్రీనివాసరావు వ్యవహారంలోనే గంగులకు సీబీఐ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

శ్రీనివాస్‌తో గంగులకు సంబంధాలు..?
శ్రీనివాస్‌తో గంగులకు పరిచయం ఉందని తెలుసుకున్న సీబీఐ అధికారులు.. వారిద్దరికి ఎప్పటి నుంచి పరిచయం ఉంది? వాళ్లు ఎప్పుడు కలిశారు? ఏం మాట్లాడుకున్నారు? అనే విషయాలను గంగుల నుంచి రాబట్టాలని సీబీఐ భావిస్తోంది. వాల్తేర్‌కు చెందిన శ్రీనివాస్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిగా.. సీబీఐ ప్రధాన కార్యాలయంలో పనిచేసిన వ్యక్తిగా పరిచయం చేసుకుంటూ వివిధ వర్గాల నుంచి డబ్బులు వసూలు చేశాడని సీబీఐ విచారణలో తేలింది. కోట్లాది రూపాయలు డీల్ చేసిన శ్రీనివాస్‌ను విచారించినప్పుడు గంగుల పేరు చెప్పినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంగులను కూడా విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని సీబీఐ భావిస్తోంది.

