InternationalNews

సరిహద్దుల్లో చొరబాటుదారులకు బీఎస్ఎఫ్ కళ్ళెం

ఈ మధ్య దేశసరిహద్దుల్లో చొరబాటుదారుల ఆగడాలు ఎక్కువైపోయాయి. ఇటీవల చైనా భారత భూభాగంలో ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించిన విషయం తెలిసిందే. అయితే భారతకు బద్ద శత్రువైన పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లో పాగా వేస్తుంది. దేశంలోకి ప్రవేశించాలని పలు రకాల ఎత్తుగడలను అమలు చేస్తూనేవుంది. ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్ తాజాగా పాకిస్తాన్ చొరబాటు దారుడిని అదుపులోకి తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. సియాల్‌కోట్ నివాసి మొహమ్మద్ షాబాద్ కదలికలను బీఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. అతను సరిహద్దు అవతల నుంచి ఆర్నియా సెక్టార్‌లోకి చొరబడుతుండగా వారు అతనిపై కాల్పులు జరిపారు. అనంతరం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని..అతని వద్ద ఏమి లభించలేదని అధికారులు తెలిపారు.

మరోవైపు జమ్మూకశ్మీర్‌లో గడిచిన ఐదు రోజుల్లో ఐదు చొరబాట్లను భద్రతాదళం అడ్డుకుంది. అంతేకాకుండా ఈ నెల 25న ఇంటర్నేషనల్ బోర్డర్ వెంట ఉన్న సాంబా జిల్లాలో చొరబడిన వ్యక్తి నుంచి 8కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. అయితే ఈ క్రమంలో బలగాలు జరిపిన కాల్పుల కారణంగా చొరబాటుదారుడు గాయపడ్డాడు. అయినప్పటికీ అతను తప్పించుకొని తన దేశం పాక్‌వైపుగా పారిపోయాడు. సైన్యం ఈ నెల 23-24 మధ్య నౌషెరా సెక్టార్‌లో రెండు చోట్ల ఇటువంటి చొరబాట్ల ప్రయత్నాలను విఫలం చేసింది. ఇందులో భాగంగా ఇద్దరు పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత్ ఒకరిని సజీవంగా పట్టుకుంది. ఇదే సమయంలో వారి నుంచి భారీగా ఆయుధాలు,మందుగుండును స్వాధీనం చేసుకుంది.  అంతేకాకుండా భారత సైన్యం ఈ నెల 25న కూడా ఉత్తర కశ్మీర్‌లోని ఉరీ సెక్టార్ ప్రాంతంలో మరొక పెద్ద చొరబాటును అడ్డగించి..ముగ్గురు పాక్ ఉగ్రవాదులను మట్టుపెట్టింది. వారి నుంచి చైనా తయారు చేసిన ఎం16(9ఎంఎ) అసాల్ట్ రైఫిల్‌తో పాటు భారీగా ఆయుధాలు,మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. మరోవైపు చలికాలం ముగిసేలోపు శిక్షణ పొందిన ఉగ్రవాదులను సరిహద్దులు దాటించేందుకు పాక్ పన్నాగాలు పన్నుతున్నట్లు సమాచారం. దేశ నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న డజన్ల కొద్దీ లాంచ్ ప్యాడ్‌లు చురుగ్గా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు శిక్షణ పొందిన దాదాపు 120-140 మంది పాక్ జాతీయ ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.