Home Page SliderNational

కర్నాటకలో కసామిసా… ర్యాలీకి రూ. 500.. సిద్ధరామయ్యపై బీజేపీ మండిపాటు

ర్యాలీలకు హాజరయ్యేందుకు సిద్ధరామయ్య ప్రజలకు ₹ 500 ఆఫర్ చేశారన్న బీజేపీ
వీడియో నిజం కాదంటూ కాంగ్రెస్ పార్టీ కౌంటర్
ర్యాలీలకు డబ్బులివ్వడం లేదంటూ స్పష్టం చేసిన కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య ఒక్కొక్కరికి ₹ 500 చెల్లించి ర్యాలీలకు ప్రజలను రప్పించమని పార్టీ నాయకులను కోరినట్లు ఆరోపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఎప్పుడు తీశారో స్పష్టంగా తెలడంలేదు. మే నాటికి జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ కొనసాగుతున్న “ప్రజాధ్వని” బస్సు యాత్రలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి ఇటీవల బెలగావిలో ఉన్నప్పుడు రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.

వీడియోలో, సిద్ధరామయ్య కెపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ జార్కిహోలి, ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాల్కర్, ఎమ్మెల్సీ చన్నరాజ్ హట్టిహోళితో పాటు ఇతరులతో చాట్ చేస్తున్నట్లు కన్పించారు. ఈ వీడియోను ట్వీట్ చేస్తూ రాష్ట్ర బీజేపీ కాంగ్రెస్ నేతపై విరుచుకుపడింది.

ఈ వీడియోపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందిస్తూ.. ‘అది నిజం కాదు, మేము ఎవరినీ ప్రోత్సహించడం లేదు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు అలాంటి పద్ధతి లేదు’ అని అన్నారు. బెళగావిలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ, “డబ్బులు చెల్లించి ప్రజలను తీసుకురావడం కాంగ్రెస్ సంప్రదాయమని, ఇందులో కొత్తగా చెప్పుకోడానికి ఏమీ లేదని… ఆశ్చర్యమూ లేదన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం, దాని గురించి ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ అలాంటి వాటిలో మునిగిపోతుంది. కాకుంటే ఇప్పుడు వీడియో బయటకు వచ్చిందన్నారు.