శ్రద్ధవాకర్ తరహాలోనే ఢిల్లీలో మరో ఘటన
అక్రమసంబంధం పెట్టుకున్న భర్త ఆయువు తీసిన భార్య
కొడుకు సాయంతో భర్తను చంపిన పూనమ్
22 ముక్కలు చేసి, ఫ్రిడ్జ్‌లో భద్రపరచిన తల్లి, కొడుకు
శ్రద్ధ కేసు తరహాలో విచారించడంతో గుట్టురట్టు
శ్రద్ధా వాకర్ దారుణ హత్యపై భయాందోళనలు ఢిల్లీలో కొనసాగుతుండగా, ఢిల్లీ తూర్పు భాగంలో ఇలాంటి తరహా నేరాన్ని పోలీసులు ఆధారాలతో సహా కనుగొన్నారు. వివాహేతర సంబంధాన్ని తెలుసుకుని కొడుకు సాయంతో భర్తను హత్య చేసిన ఓ మహిళను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని 22 ముక్కలుగా నరికి, ఫ్రిజ్‌లో భద్రపరచి, తూర్పు ఢిల్లీలోని అనేక పరిసర ప్రాంతాలలో పారవేసినట్టు విచారణలో పోలీసులు కనుగొన్నారు. 28 ఏళ్ల ఆఫ్తాబ్ పూనావాలా, తనతో సహజీవనం చేస్తున్న భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను గొంతు కోసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి ఆపై దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ అడవిలో విసిరినట్టుగానే మరో ఘాతుకాన్ని పోలీసులు గుర్తించారు. శ్రద్ధా తరహాలో కేసును విచారించడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. జూన్‌లో పాండవ్ నగర్‌లో పోలీసులు మొదట శరీర భాగాలను కనుగొన్నారు. అయితే అవి కుళ్ళిపోయిన కారణంగా వాటిని గుర్తించలేకపోయారు. శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించిన భయంకరమైన వివరాలు వెలుగులోకి రావడంతో పాండవ్ నగర్ నివాసి అంజన్ దాస్‌కు చెందినవేమోనన్న కోణంలో పోలీసులు.. మరోసారి విచారించడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి.
నిందితులు పూనమ్, ఆమె కుమారుడు దీపక్ జూన్‌లో దాస్‌ను అక్రమ సంబంధం కారణంగా హత్య చేసినట్లు పోలీసులకు తెలిపారు. మొదట నిద్రమాత్రలు ఇచ్చి హత్య చేసినట్టు అంగీకరించారు. త్రిలోక్‌పురి ప్రాంతంలో ఈ నేరం జరిగింది. పాండవ్ నగర్‌లోని అనేక ప్రాంతాల్లో శరీర భాగాలను పారవేసి.. అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డారు. CCTV కెమెరాల ద్వారా షాకింగ్ ఫుటేజ్ బయటకొచ్చింది. అర్థరాత్రి దీపక్, తన చేతిలో బ్యాగ్‌తో నడుస్తున్నట్లు కన్పించింది. ముక్కలు చేసిన శరీరాన్ని విసిరేయడానికి అనేకసార్లు ఢిల్లీ తూర్పు ప్రాంతానికి దీపక్ వెళ్లినట్టు పోలీసులు నిర్ధారించారు. దీపక్‌తోపాటు అనుమానం రాకుండా తల్లి పూనమ్ కూడా వెళ్లడాన్ని సీసీటీవీలో పోలీసులు చూశారు. స్పష్టంగా శరీర భాగాలను పారవేయడానికి ఇద్దరూ కలిసి వెళ్లినట్టుగా పోలీసులు తేల్చారు.