ఇటుక బట్టీలో భారీ పేలుడు.. 9 మంది దుర్మరణం
బిహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇటుకల బట్టీలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది కార్మికులు మృతి చెందారు. మరో 22 మంది కూలీలు గాయపడ్డారు. తూర్పు చంపారన్ జిల్లా బరౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రతన్సరాయ్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ పని చేసే కూలీలు మట్టి ఇటుకలను బట్టీలో పేర్చిన తర్వాత.. దానికి నిప్పు పెట్టారు. అనంతరం మంటలు చెలరేగి.. ఒక్కసారిగా చిమ్నీ పేలిపోయింది. భారీ పేలుడు సంభవించడంతో పలువురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతుల్లో ఇటుక బట్టీ యజమాని మహ్మద్ ఇష్రార్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఈ ఘటనపై దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, గాయపడిన వారికి 50 వేల పరిహారం ప్రకటించారు.
