టీమిండియాకు వారిద్దరే వెన్నెముక… ఎందుకంటే…!?
రాబోయే కొత్తతరం టీమిండియా క్రికెట్ జట్టుకు కీలక బ్యాట్స్‌మన్ విషయంలో మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందించారు. కొత్త తరంలో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ సుదీర్ఘకాలం పాటు అన్ని ఫార్మాట్లలో ఆడడానికి సిద్ధమయ్యారని, వారే జట్టుకు వెన్నెముకగా మారనున్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ బ్యాటింగ్‌లో సూపర్ హీరోలుగా ఉన్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల కెరీర్ ముగింపు దశకు చేరుకోవడంతో రాబోయే కొత్త జట్టుకు దిక్కెవరన్న ప్రశ్న ఎదురయ్యింది. వీరిద్దరూ టీ 20 ప్రపంచకప్ విజయం తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వారు మరో రెండేళ్లలోనే ఇతర ఫార్మాట్లకు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20లో విజయంతో మన జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. వన్డేలు, టెస్టుల్లో అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే మరింత అనుభవం సంపాదించాల్సిన అవసరం ఉంది. మన క్రికెట్ టీమ్‌లో వన్డేలలో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పటేల్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు కూడా ఉన్నారు. రిషబ్ పంత్, ధ్రువ్ జురిల్, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు కూడా జట్టులో బలంగా స్థిరపడాల్సిన అవసరం ఉంది. అని ఈ మాజీ కోచ్ వ్యాఖ్యానించారు.

