Andhra PradeshHome Page Slider

వామ్మో… ఇంటికి లక్షా.. హిందూపురంలో ఆ స్వామీజీ రూటే సెపరేటా?

రాజకీయాల్లో హామీలివ్వడం, ఆ తర్వాత మరిచిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ గొర్రె కసాయివాడిని నమ్మినట్టుగా సామాన్యులు రాజకీయనేతలను నమ్ముతూనే ఉంటారు. కానీ ఈసారి ఏపీ ఎన్నికల్లో ఒక ఆసక్తికర ఘట్టం ఆవిష్కృతమవవుతోంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సీన్ కన్పిస్తోంది. శ్రీపీఠం నిర్వహకులు, ఆధ్యాత్మకవేత్త స్వామి పరిపూర్ణానంద ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూ, అక్కడి ప్రజలకు నేనున్నానన్న భరోసా ఇస్తున్నారు. బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా పార్టీలో రాజకీయాలతో ఆయనకు టికెట్ లభించలేదు. అయితే ముందుగా అనుకున్నట్టుగా, ఆయన ఎన్నికల బరిలో దిగారు. హిందువు అన్న ఒక్క పదంతో పులకించిపోయే స్వామి పరిపూర్ణానంద, టీడీపీ అభ్యర్థి సినీ నటుడు బాలకృష్ణ, వైసీపీ అభ్యర్థి దీపికపై హిందూపురంలో గెలిచితీరాతానంటున్నారు.

హిందూభావజాల వ్యాప్తితో తెలుగుజాతికి సుపరిచితుడిగా గుర్తింపు పొందిన స్వామి పరిపూర్ణానందను గెలిపించుకుతీరతామంటున్నారు నియోజకవర్గ ఓటర్లు. పార్టీ టికెట్ ఇవ్వకున్నా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా సత్తా చాటుతున్నారు. ఈ ఎన్నికల్లో అగ్గిపెట్టె గుర్తుతో ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. తాను ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తానో వివరిస్తూ ప్రజల హృదయాలను పరిపూర్ణానంద గెలుచుకుంటున్నారు. హిందూపురం వాసులకు ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు అగ్గిపెట్టె గుర్తుపై వేసి, గెలిపించుకుంటే ప్రతి ఇంటికి లక్ష లబ్ది కలిగిస్తానని భరోసా ఇస్తు్న్నారు. ఇప్పటి వరకు అందుతున్న ప్రభుత్వ పథకాలకు అదనంగా బెనిఫిట్ కలుగుతుందని చెప్పారు. తన వద్ద హిందూపురం వాసుల కోసం ప్రణాళిక ఉందంటున్నారు.

ఇచ్చిన మాట కోసం తాను జీవిస్తున్నానని, ఎన్నికల్లో గెలిపిస్తే సత్తా చాటుతానంటున్నారు స్వామి పరిపూర్ణానంద. పొత్తులో భాగంగా పార్టీ టికెట్ ఇవ్వకపోయినా, పోటీ చేయాలన్న ధృఢ లక్ష్యంతో బరిలో దిగానంటున్నారు. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీ లక్ష రూపాయలు లబ్ది చేకూర్చేందుకు తన వద్ద ప్రణాళిక సిద్ధంగా ఉందంటున్నారు. ఇచ్చిన మాట తూ.చా తప్పకుండా మేలు చేస్తాసిచూపిస్తానంటున్నారు. ఈనెల 10 తేదీన శుక్రవారం బహిరంగ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. తనకు అన్ని ప్రాంతాలు సమానమని, నాడు అక్కడ స్థలం లభించడం వల్ల కాకినాడ ఆశ్రమం నిర్మించామని, ఇకపై హిందూపురమే తన కేంద్ర స్థలమవుతుందని ఆయన చెప్పారు. ఒకవేళ అవకాశం లభిస్తే, రాష్ట్ర ప్రజల కోసం తాను నిలబడతానన్నారు. తాను వెనకడుగు వేసే వ్యక్తినికానన్నారు. ఈ ఎన్నికల్లో తనకు ధర్మం సహకరిస్తుందని, ప్రకృతి తనకు అండగా ఉంటుందని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.