Andhra PradeshHome Page Slider

పరిశీలనలో 1,122 నామినేషన్లను EC తిరస్కరణ: వెల్లడించిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు శుక్రవారం దాఖలైన నామినేషన్ల పరిశీలన అనంతరం 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 503 నామినేషన్లు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,705 నామినేషన్లు చెల్లుబాటయ్యే విధంగా దాఖలైనట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. లోక్ సభ కోసం 183 నామినేషన్లు, అసెంబ్లీ కోసం 939 నామినేషన్లు పరిశీలన అనంతరం తిరస్కరణకు గురైనట్లు సీఈవో శనివారం మీడియాకు విడుదల చేశారు. ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 3,644 నామినేషన్లు దాఖలయ్యాయని ముఖేష్ కుమార్ తెలిపారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి అత్యధికంగా 47 నామినేషన్లు, అత్యల్పంగా శ్రీకాకుళంలో 16 నామినేషన్లు వచ్చాయి. అసెంబ్లీ పరంగా చూస్తే తిరుపతి నియోజకవర్గంలో అత్యధికంగా 52 నామినేషన్లు, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి అత్యల్పంగా ఎనిమిది నామినేషన్లు వచ్చాయన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 చివరి తేదీ అని సీఈవో తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మిగిలి ఉన్న అభ్యర్థుల సంఖ్యను మే 13న ఎన్నికలకు అభ్యర్థులుగా పరిగణిస్తామని తెలిపారు.