Andhra PradeshHome Page Slider

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం

విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకదాని వెంట ఒకటి వెళ్తుండగా మొదటి రైలు ఆగడం, వెనుక నుండి రెండో రైలు డీ కొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మందికి పైగా మరణించినట్లు వివరాలు అందుతున్నాయి. అయితే ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింతగా పెరిగె అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం ఉత్తరాంధ్రను ఉలిక్కిపడేలా చేసింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 7.10 గంటల సమయంలో విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్తవలస మండలం ఆలమండ కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం పట్టాలపై ఆగి ఉంది.

అదే సమయంలో దాని వెనకే వస్తున్న విశాఖ రాయగఢ రైలు ముందు ఆగి ఉన్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు ఢీకొనగా ప్రమాదంలో ఐదు భోగీలు పట్టాలు తప్పాయి. వాటిలో రెండు భోగీలు పక్కన ఉన్న ట్రాక్ పై ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ తో ఉన్న గూడ్స్ భోగి లపై పడ్డాయి. దీంతో మొత్తం మూడు భోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. కాగా రెండు రైళ్లు బలంగా ఢీకొనటం వల్ల ఘటనా స్థలంలో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. మరోవైపు ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొనడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. రెండు ప్యాసింజర్ రైలులు కావటం సరైన వివరాల లేకపోవడంతో మృతులను తక్షణమే గుర్తించే అవకాశం లేకుండా పోయింది. విశాఖ రైల్వే స్టేషన్లో ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లతో పాటు అందుబాటులో అంబులెన్స్లను ఉంచారు. క్షతగాత్రులను గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రైల్వే బృందాలు సిద్ధమయ్యాయి.

ఇదిలా ఉంటే ఘోర రైలు ప్రమాదం పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని యుద్ధ ప్రాతిపదికపై సహాయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ను ఆయన ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.