గాంధీ జయంతి రోజున నారా భువనేశ్వరి నిరాహార దీక్ష, జైల్లో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ శనివారం కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. శనివారం నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ప్రాంతంలోనే తెలుగుదేశం పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో జరగగా నారా లోకేష్ జూమ్ లో పాల్గొన్నారు.

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అక్టోబర్ 2 రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు ప్రతి ఇంట్లో లైట్ లన్నీ ఆర్పి ప్రజలు నిరసన తెలపాలని విజ్ఞప్తి చేసింది. లైట్లు ఆపి వరండాలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ జేఏసీ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అలానే ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో జనసేనతో సమన్వయం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు ఉండేలా కార్యాచరణను ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
