విచారణకు హాజరుకావాలంటూ లోకేష్‌కు సీఐడి నోటీసులు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ప్రశ్నించేందుకు ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (ఏపీసీఐడీ) నోటీసులు అందజేసింది. సిఆర్పిసి సెక్షన్ 41 (ఎ) కింద లోకేష్‌కు నోటీసును వాట్సప్ ద్వారా పంపించింది. లోకేష్‌ను సిఐడి వెంటనే అరెస్టు చేసే అవకాశం లేనందున స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తారు. లోకేష్‌ను అరెస్ట్ చేయాలంటే సిఆర్పిసి సెక్షన్ 41(ఎ)(4) ప్రకారం సిఐడి కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంది. లోకేశ్ తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదిస్తూ.. విచారణకు సహకరించినా తన క్లయింట్‌ను దురుద్దేశంతో దర్యాప్తు సంస్థ అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. సరైన ఆధారాలు లేకుండానే సిఐడి పిటిషనర్‌పై ఆరోపణలు చేస్తోందన్నారు. పిటిషనర్‌కు కేవలం ఒక రోజు ముందుగానే నోటీసు జారీ చేయవచ్చని పేర్కొంటూ, నోటీసును అందించిన తర్వాత పిటిషనర్ సిఐడి ముందు హాజరు కావడానికి తగిన సమయాన్ని అనుమతించాలని దర్యాప్తు సంస్థను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయవాది కోర్టును కోరారు.

ఐతే, సరైన కారణం లేకుండా అరెస్టు చేస్తే పిటిషనర్ తనను సంప్రదించవచ్చని కోర్టు పేర్కొంది. 2022 ఏప్రిల్‌లో మంగళగిరి ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదు మేరకు సిఐడి తనపై దురుద్దేశంతో కేసు నమోదు చేసిందని లోకేష్ తన ముందస్తు బెయిల్ పిటిషన్లో ఆరోపించారు. రియల్టర్ లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్‌లో తన తండ్రి చంద్రబాబు నాయుడుతో కలిసి నివాసం ఉంటున్నందున తన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు తెలిపారు. ఐఆర్ఆర్ కేసులో మంత్రి హోదాలో గానీ, మరే ఇతర హోదాలో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదని లోకేష్ తేల్చి చెప్పారు. ఈ కేసులోని ఇతర నిందితులకు కూడా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని ఆయన ఎత్తిచూపారు. ఫైబర్‌నెట్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 4కి పోస్ట్ చేసిన హైకోర్టు, ఎపిఎస్ఎస్డిసి కేసులో అక్టోబరు 4 వరకు అరెస్టు చేయవద్దని సిఐడిని ఆదేశించింది.