ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు పాటు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్, ఆర్థిక మంత్రి రాజేంద్ర నాథ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ప్రసాదరాజు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ శాసనసభ ఉపపక్ష నాయకుడు అచ్చన్నాయుడు ప్రకటించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ విపక్ష నేత చంద్రబాబు నిజస్వరూపాన్ని బహిర్గతం చేసే స్కిల్ స్కాంతో సహా సభలో కూలంకషంగా చర్చ జరగాలన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియకూడదనే వ్యూహంతో తెలుగుదేశం పార్టీ సమావేశాలకు వస్తోందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఐదు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలు ఈనెల 27 తో ముగుస్తాయి. అయితే శని, ఆదివారాలు శాసనసభకు సెలవు ఉంటుందని బీఏసీలో ప్రకటించారు. ఈ నెల 22న శాసనసభలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు పై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. రోజుకు రెండు చొప్పున ఎనిమిది అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించారు.
