కోరుట్ల అభ్యర్థి మార్పు వెనుక రియల్ స్టోరీ
బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు కనిపిస్తోంది. హ్యాట్రిక్ విజయాలతో చరిత్ర సృష్టించాలని భావిస్తున్న కేసీఆర్ ఈసారి తేడా వస్తే ఏమవుతుందోనన్న బెంగలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో సిట్టింగ్‌లను మార్చాలని భావించినప్పటికీ ఆయన ఆ సాహసం చేయలేకపోయారు. మరోసారి అదే పరిస్థితి నెలకొంది. అనవసరమైన రిస్క్ ఎందుకనుకున్నారో ఏమో గానీ, ఈసారి, కేసీఆర్ సిట్టింగ్‌లు అందరికీ దాదాపు టికెట్లు కేటాయించారు. కొందరికి మాత్రమే టికెట్లు ఇవ్వలేదు. నాలుగు స్థానాలు మినహా కేసీఆర్ దాదాపు అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను ఖరారు చేసారు. తాను ఏకంగా రెండు స్థానాల్లో పోటీ చేస్తుండగా మరికొందరు నేతలకు ఈసారి కేసీఆర్ ఝలక్ ఇచ్చారు. మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్యకు ఘన్ పూర్ నుంచి టికెట్ నిరాకరించిన కేసీఆర్, ఆ స్థానంలో కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చారు. ఇక దుబ్బాకలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఉప్పల్‌లో బేతి సుభాష్ రెడ్డి స్థానంలో బండారు లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నుంచి ఆజ్మీర్ రేఖా నాయక్ స్థానంలో భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్‌కు ఛాన్స్ ఇచ్చారు. వేములవాడలో చెన్నమనేని రమేష్ స్థానంలో, చెల్మడ లక్ష్మీ నరసింహారావుకు అవకాశం ఇచ్చారు.

ఇక వీటిలో విశేషంగా చెప్పుకోవాల్సిన నియోజకవర్గం కోరుట్ల. ఇక్కడ్నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరోసారి బరిలో దిగుతారని అందరూ భావించారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఆయనకు బదులుగా కుమారుడు కల్వకుంట్ల సంజయ్‌ను బరిలోకి దించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది తమ కుమారులను బరిలోకి దింపడానికి సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసుకున్నప్పటికీ ఎవరికి అనుమతించని గులాబీ బాస్ ఒక్క విద్యాసాగర్ రావుకు మాత్రమే ఆ అవకాశం కల్పించారు. అయితే కోరుట్ల నియోజకవర్గంలో ఇప్పటికి నాలుగు సార్లు గెలవడంతో తనపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని ఇదే సమయంలో మరోసారి తాను ఎన్నికల్లో గెలవడం కష్టమన్న భావనను విద్యాసాగర్ వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకోసమే తన కుమారుడికి సీట్ ఇస్తే గెలిపించుకొని అసెంబ్లీకి తీసుకొస్తానంటూ విద్యాసాగర్ రావు కేసీఆర్‌కు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.

కోరుట్ల నియోజకవర్గంలో గత నాలుగు సార్లుగా విద్యాసాగర్ రావు గెలుస్తున్నప్పటికీ నియోజకవర్గంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండటంతో ఈసారి కోరుట్లలో పోటీ ఎలా ఉంటుందన్నదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. మూడు పార్టీల నుంచి వెలమ సామాజికవర్గం నాయకులు రేసులు నిలుస్తోండటంతో ఈసారి ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నదానిపై ఎంతో సస్పెన్స్ నెలకొంది. అయితే ఈసారి కోరుట్లలో బీజేపీ విజయం తధ్యమంటున్నారు ఆ పార్టీ నేతలు. తాజా సర్వేలు సైతం కోరుట్లలో బీజేపీ విజయం సాధిస్తోందని చెబుతున్నాయంటున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సురభి భీమ్రావు తనయుడు నవీన్ కుమార్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నియోజకవర్గాన్ని జల్లెడ పడుతూ గడపగడపను టచ్ చేస్తున్నారు. ప్రజల సమస్యలను వింటూ, వారికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం తనదేనన్న దీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. త్రిముఖ పోరు కొనసాగినప్పటికీ… బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను మట్టికరిస్తానని నవీన్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.