మణిపూర్ ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టిన జాతీయ మానవ హక్కుల సంఘం(NHRC)
మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లు, హింసాకాండలు, మహిళలపై అరాచకాలు, హత్యలు వంటి అమానవీయ సంఘటనలపై జాతీయ హక్కుల సంఘం మణిపూర్ ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టింది. ఇకమీదట ఎలాంటి హింస జరగడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. తగిన చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించింది. ఇప్పటి వరకూ అసలు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ఇకపై ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? వంటి విషయాలతో సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించింది. ప్రాంతాలు, తెగలు, జాతుల మధ్య వైషమ్యాలు పెచ్చు పెరిగి అరాచక శక్తులు విజృంభిస్తున్నాయని, దీనిని అణచివేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. మహిళలపై హింసాత్మక సంఘటనలు జరగడం సిగ్గుచేటని, వారి మాన ప్రాణాలను కాపాడలేకపోతే అది ప్రభుత్వ అసమర్థ పాలన క్రిందకే వస్తుందని, ఇలాంటి ఘటనలపై ఏ చర్యలు తీసుకున్నారో వెంటనే తెలియజేయాలని ఆదేశించింది.